కొవిడ్‌ చికిత్సకు రోబో సాయం

ABN , First Publish Date - 2021-05-27T05:30:00+05:30 IST

కరోనాకు భయపడి మనమంతా ఇళ్లల్లోనే కూర్చొంటున్నాం. మరి కొవిడ్‌ రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బంది మాటేమిటి! ప్రతి రోజూ వారికి వైరస్‌ బాధితుల మధ్యనే పొద్దుపొడుస్తోంది. ఆ వార్డుల్లోనే పొద్దుగూకుతోంది. ఈ కర్తవ్యంలో ప్రాణాలు పోగొట్టుకున్న వైద్యులు ఎందరో! ఇది బిహార్‌

కొవిడ్‌ చికిత్సకు రోబో సాయం

కరోనాకు భయపడి మనమంతా ఇళ్లల్లోనే కూర్చొంటున్నాం. మరి కొవిడ్‌ రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బంది మాటేమిటి! ప్రతి రోజూ వారికి వైరస్‌ బాధితుల మధ్యనే పొద్దుపొడుస్తోంది. ఆ వార్డుల్లోనే పొద్దుగూకుతోంది. ఈ కర్తవ్యంలో ప్రాణాలు పోగొట్టుకున్న వైద్యులు ఎందరో! ఇది బిహార్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆకాంక్షను కదిలించింది. అందుకే వారికి సహకరించేందుకు ఏకంగా ఒక రోబోనే రూపొందించింది. 


‘మెడి రోబో’... ఇరవై ఏళ్ల ఆకాంక్ష తయారు చేసిన రోబో ఇది. ఒక్క బిహార్‌లోనే కాదు... దేశవ్యాప్తంగా ఇప్పుడీ రోబో గురించి చర్చ జరుగుతోంది. ఆకాంక్షపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే... సిబ్బందితో పనిలేకుండా పేషెంట్‌కు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. ఫలితంగా ఎవరూ బాధితుల దగ్గరకు నేరుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ విపత్కాలంలో వైద్య సిబ్బంది కొరత సమస్యనూ అధిగమించవచ్చు. 


నాన్నతో కలిసి... 

‘‘కరోనాపై పోరాటానికి రకరకాల మందులు వాడుతున్నాం. మరోపక్క యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో దేశంలోని దాదాపు అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి భారీ కొరత ఏర్పడింది. దీంతో సమయానికి వైద్యం అందక బాధితులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దాంతోపాటు చికిత్స చేసే క్రమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు చూసినప్పుడల్లా నాకు ఎంతో బాధ కలిగేది. దీనికి పరిష్కారం ఏమిటని ఆలోచిస్తున్నప్పుడు ‘మెడి రోబో’ తట్టింది. వెంటనే మా నాన్న యోగేశ్‌కుమార్‌కు చెప్పాను. ఆయనతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాను’’ అంటూ చెప్పుకొచ్చింది ఆకాంక్ష. 


బీపీ... ఈసీజీ... ఇంకా ఎన్నో... 

‘‘నేను అభివృద్ధి చేసిన రోబో వల్ల వైరస్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిలో కొందరి ప్రాణాలైనా నిలబడతాయని ఆశిస్తున్నా. ఈ రోబోను రిమోట్‌ సాయంతో ఎక్కడికి కావాలంటే అక్కడికి కదిలించవచ్చు. రియల్‌టైమ్‌ టేటాను అనుసంధానించి వైరస్‌ సోకినవారికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. అంతేకాదు... దీని సాయంతో రక్తంలో గ్లూకోజ్‌, ఆక్సిజన్‌ స్థాయిలను పరీక్షించవచ్చు. హార్ట్‌రేట్‌, టెంపరేచర్‌, బీపీ, బరువు, ఈసీజీ వంటివి కూడా వైర్‌లెస్‌ స్టెతస్కోప్‌ను ఉపయోగించి తెలుసుకోవచ్చు’’ అంటూ ఆకాంక్ష తన రోబో పనితీరును వివరించింది. 


వీడియోతో వైద్యం... 

ముఖ్యంగా ఈ రోబో... కరోనా రోగులకు వేళకు మందులు, ఆహారం, మంచినీళ్ల వంటివి ఇవ్వడం, నిరంతరం ఆక్సిజన్‌ మానిటరింగ్‌, నెబులైజేషన్‌ వంటి సేవలు అందిస్తుంది. 360 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. దీనికి హైరిసొల్యూషన్‌ విజన్‌ కెమెరా అమర్చారు. తద్వారా పేషెంట్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించుకోవచ్చు. అంతేకాదు... ఆసుపత్రి బయట, అంటే రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, కార్యాలయాల వంటి వాటిల్లో కూడా వీడియో కాన్ఫరెన్స్‌ జరపవచ్చు. క్యూఆర్‌ కోడ్‌ సాంకేతికత ఆధారంగా ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. దీనివల్ల వైరస్‌ బాధితులను వైద్యులు రియల్‌టైమ్‌లో పరీక్షించి, మందులు, సూచనలు ఇచ్చే వీలుంటుంది.   


కేంద్ర మంత్రి ఫిదా... 

ఆపత్కాలంలో ఉపయోగపడేందుకు ఆకాంక్ష చేసిన ఈ అద్భుత సృష్టి... కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ దృష్టిలో పడింది. ఆయన ఆకాంక్షను వ్యక్తిగతంగా ఆహ్వానించి, అభినందించారు. అంతేకాదు... ఈ రోబో అభివృద్ధికి అవసరమైన మద్దతు, సహకారాన్ని అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. దేశంలోని వైద్య నిపుణులెందరో ఆకాంక్ష ప్రయత్నానికి ఫిదా అయ్యారు.


ఇది తనకు అంతులేని ప్రోత్సాహాన్ని ఇచ్చాయంటూ ఎంతో సంతోషపడుతోంది పట్నాలో ఇంజనీరింగ్‌ చదువుతున్న ఆకాంక్ష. ఆమె రూపొందించిన ‘మెడి రోబో’ ప్రతిష్టాత్మక ‘విశ్వకర్మ’ అవార్డ్‌ ఫైనల్‌ రౌండ్‌కు ఎంపికైంది. ఇవన్నీ తనకు స్ఫూర్తినిస్తాయంటున్న ఆకాంక్ష మరిన్ని నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిస్తోంది. 

Updated Date - 2021-05-27T05:30:00+05:30 IST