అద్దెకు రోబోలు

ABN , First Publish Date - 2021-01-12T09:18:12+05:30 IST

ఆతిథ్యం, హెల్త్‌కేర్‌, బ్యాంకింగ్‌ వంటి రంగాల్లో సేవలు అందించడానికి హైదరాబాద్‌కు చెందిన విస్టన్‌ నెక్స్ట్‌జెన్‌ రోబోలను అద్దెకు ఇవ్వనుంది.

అద్దెకు రోబోలు

హోటల్‌, ఆసుపత్రుల్లో సేవలకు ‘ఫ్లాంకీ’.. ప్రవేశపెట్టిన విస్టన్‌ నెక్ట్స్‌జెన్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆతిథ్యం, హెల్త్‌కేర్‌, బ్యాంకింగ్‌ వంటి రంగాల్లో సేవలు అందించడానికి హైదరాబాద్‌కు చెందిన విస్టన్‌ నెక్స్ట్‌జెన్‌ రోబోలను అద్దెకు ఇవ్వనుంది. అద్దె ప్రాతిపదికన రోబోలను సమకూర్చేందుకు దేశంలోనే తొలిసారిగా రోబో యాజ్‌ ఏ సర్వీస్‌ (ఆర్‌ఏఏఎస్‌) ప్రా రంభిస్తున్నట్లు విస్టన్‌ నెక్స్ట్‌జెన్‌ వ్యవస్థాపకుడు రామరాజు సింగం తెలిపారు. తొలిసారి దేశీయంగా తయారు చేసిన రోబో ‘ఫ్లాంకీ’ని కంపెనీ ప్రవేశపెట్టింది. ఫ్లాంకీ రోబోలు పూర్తి స్థాయి అటానమస్‌ సర్వీస్‌ బాట్‌ లు. సేవల రంగంలో ఇవి విప్లవాత్మక మార్పులు తీసుకురాగలవని రామరాజు అన్నారు.


 సుసృతి, కొవిడ్‌-19 స్టీవార్డ్‌ వంటి ఫ్లాంకీ రోబోలు ఆరోగ్య సంరక్షణ, ఫ్లాంకీ బేరర్‌  రెస్టారెంట్‌, హోటల్‌ పరిశ్రమ కోసం, బ్యాంకింగ్‌ అసిస్టెంట్‌ బ్యాంకింగ్‌ రంగం కోసం, విద్యా రంగం కోసం ఫ్లాంకీ వజ్రా ఆచార్యలను రూపొందించినట్లు వివరించారు. 

 

జూన్‌లో హ్యూమనాయిడ్‌ రోబో : వచ్చే ఏడాది కాలంలో మరిన్ని రకాల రోబోలను కంపె నీ ప్రవేశపెట్టనుంది. జూన్‌ నాటికి మొదటి తరం హ్యూమనాయిడ్‌ రోబోను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు రామరాజు వివరించారు. దక్షిణాదిలోని చిన్న, మధ్య స్థాయి సంస్థలతో కలిసి ప్రస్తుతం రోబోలను తయారు చేస్తున్నామని, త్వరలో హైదరాబాద్‌లో సొంత తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసే ఆలోచన ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి కూడా చర్చలు జరుపుతున్నామని చెప్పారు. కాగా విమానం నడిపేందుకు రోబోను సరఫరా చేయడానికి యూర్‌పనకు చెందిన విమానయాన సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.

Updated Date - 2021-01-12T09:18:12+05:30 IST