శైలారోహణ

ABN , First Publish Date - 2021-01-26T06:55:02+05:30 IST

రానే వచ్చిందా రోజు మనలోకి మనం ప్రశ్నల్ని సంధించుకునే రోజు. అంతులేని తిమిరావరణంలో...

శైలారోహణ

రానే వచ్చిందా రోజు

మనలోకి మనం

ప్రశ్నల్ని సంధించుకునే రోజు.

అంతులేని తిమిరావరణంలో

వెలుగురేఖలను అందిపుచ్చుకునే రోజు,


అవును

ఇప్పటిదాకా వాటిల్లిన

నష్టాన్ని మోసుకుంటూ

ఒక సముద్రాన్ని దాటడానికి

సంకల్పం చెప్పుకునే రోజు,


ఇప్పుడే మనం ధైర్యంగా

ఒక మృగం పొట్టను పగులగొట్టాం.

అన్ని వేళలా

నిశ్శబ్దాన్ని నిర్విరామ శాంతిగా

భ్రమించరాదని గ్రహించాం,


న్యాయంలోని సంప్రదాయం గురించీ

దృక్పథంలోన్నీ బలాన్ని తెలుసుకున్నాం.

అవి కేవలం మంచులా

కరిగేవి కావని తెలుసుకున్నాం,


ఐనా తెలుసుకునే లోపలే

ఉదయం మన సొంతమయింది,

చీకటిని అధిగమించి

కాంతితీరాన్ని సాధించాం,

ముక్కలు కాకుండా

దేశాన్ని కాపాడుకున్నాం,

కాని ఇది సంపూర్ణం కాదు,


దేశకాలాలకు

వారసులమైన మనం

ఓ నల్లపిల్ల

బానిసల నుంచి వచ్చిన

ఓ ఒంటరితల్లి నోములపంట

అధ్యక్షురాలయ్యే కలలు కనొచ్చని గ్రహించాం.


మనం నాజూగ్గా లేకపోవచ్చు

శుభ్రంగా కనపడకపోవచ్చు

కాని మనం శ్రమించి దక్కించుకున్న

ఐక్యతకు ఓ లక్ష్యం ఉంది,

విస్తృత ప్రయోజనం ఉంది.


సకలవర్ణాల సమ్మేళనంతో

ఒకే జాతిని ఆవిష్కరిస్తున్నాం

అసమానతల కొలబద్దలను

కలిసి తొలగించుకుందాం.

అన్ని సంస్కృతులకూ

అందమైన వేదిక నిర్మిద్దాం.

విభజన బీటలను అతికిద్దాం,

విభేదాలు పక్కన పెడదాం

ఆయుధాలు త్యజించి

భుజం భుజం కలిపి పనిచేద్దాం.

ఇదే సత్యమని

జగం నిండా చాటుదాం

ఎన్నో దుఃఖాలు సహించి

ఇంత దూరం ఎదిగాం

గాయపడ్డా

ఆత్మస్థైర్యాన్ని ఎగరేస్తున్నాం.


అలిసినా సొలిసినా

సమష్టి ప్రయత్నాన్ని ఆపలేదు

గెలిచాం కూడా.

ఇప్పుడిక మరోసారి

వేర్పాటును నాటొద్దు మనం.

మేడిచెట్టు కింద కూర్చుని

ఆనందించే క్షణాలుంటాయని

బైబిల్ ఎప్పుడో

భవిష్యద్దర్శనం చేసింది.


సమకాలంలో జీవించే వారికే విజయం

అది తృణప్రాయుల

పదఘట్టనల కింద అణిగిపోదు.

మనం కట్టే పలు వంతెనలు

కొత్త దారులకు వాగ్దానం చేస్తున్నాయి.

అవును! మనం మొక్కవోని సాహసంతో

శైలారోహణ చెయ్యక తప్పదు.

అమెరికన్ కావటమే మన ఆదర్శం

విఘాతమిప్పుడు గతం

మరమ్మతులకు నడుం బిగిద్దాం.

విచ్ఛిన్నశక్తులు తోకముడిచాయి

ప్రజాస్వామ్యం ఆలస్యమైనా

విషం కాకుండా చూశాం.


ఇది సత్యం

ఇది మన నమ్మకం

రేపటి పైనే మన చూపు

చరిత్ర కళ్లన్నీ మనవైపు

ఇదొక న్యాయశకం.

మన శక్తి ఏమిటో తెలిసొచ్చింది.

కొత్త అధ్యాయాన్ని రచిద్దాం,

అనుకోని ప్రమాదం

ప్రమోదంగా ముగిసింది.

దేశం గాయపడినా

తిరోగమనం లేదు మనకు

ప్రేమా స్వేచ్ఛా తీవ్రతల నుంచి

పక్కకు వైదొలగం మనం.


భయపెడితే లొంగుతామా

ఉదాసీనత నిన్నటి కథ

కరుణా శక్తీ కలిసిన వెత మనది.

ప్రేమ మన ప్రస్తుత పథం

మార్పు మన పిల్లల జన్మహక్కు

దాని కోసం మంచి దేశాన్ని నిర్మిద్దాం.

ఉక్కులాంటి నా వక్షస్థలంలో

కదలాడే శ్వాసలోంచి

గాయపడిన దేశాన్ని పైకి లేపుదాం.


బంగారు కాంతుల

పశ్చిమ పర్వతాల్లోంచి లేద్దాం

మన పూర్వులు విప్లవాన్ని కలగన్న

సుడిగాడ్పుల ఈశాన్య దిశ నుంచి లేద్దాం

మధ్యపశ్చిమ ప్రాంతాలలోని సరస్సుల అంచున మొలిచిన నగరాల్లోంచి లేద్దాం

దక్షిణప్రాంత సూర్యతాపంలోంచి లేద్దాం

శిథిలాలను మళ్ళీ కడదాం

కుదుటపడి ఎదుటపడదాం.


మూలమూలల్లోంచి

విభిన్న సంస్కృతుల్లోంచి

అతి సుందరదేశం ఆవిర్భవిస్తుంది

దెబ్బతిన్నదే కావచ్చు, అబ్బో! అందమైంది

రానే వచ్చిందా రోజు

చీకట్లోంచి బయటపడదాం

జ్వలిద్దాం

నిర్భయంగా చలిద్దాం

రోచిస్సులకు ముగింపు ఉండదు

సాహసం కావాలి మనకు

మనమే సాహసం కావాలిప్పుడు.

అమండా గోర్‌మన్

స్వేచ్ఛానువాదం: డా. ఎన్. గోపి

(జనవరి 20న అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో 22 ఏళ్ల ఈ ఆఫ్రికన్‌ అమెరికన్‌ ‘The Hill We Climb’ అంటూ రాసి, చదివిన కవిత ఇది)

Updated Date - 2021-01-26T06:55:02+05:30 IST