Abn logo
Nov 23 2020 @ 02:17AM

రోడ్లా.. రోలర్‌ కోస్టర్లా!

Kaakateeya

అధ్వానంగా మారిన కాలనీ రోడ్లు

వరదల తర్వాత మరిన్ని గుంతలు

కంకర తేలి ప్రమాదకరంగా మారిన వైనం

వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు

ప్రధాన రహదారులకే మరమ్మతు పరిమితం

వాటిపైనా మళ్లీ మళ్లీ కార్పెటింగ్‌లు

గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ప్యాచ్‌వర్క్‌లు

జీహెచ్‌ఎంసీ తీరుపై తీవ్ర విమర్శలు


జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఓట్లు అడిగేందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు యాప్రాల్‌ వెళ్లారు. స్థానికులు ‘నో రోడ్స్‌.. నో ఓట్స్‌’; ‘రోడ్డు వేయండి. ఓటు అడగండి’ అనే ప్లకార్డులతో స్వాగతం పలికారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన సెగ తగలడంతో ఎన్నికలు అయిపోగానే సొంత నిధులతో రోడ్డు వేయిస్తానంటూ ఎమ్మెల్యే తన లెటర్‌ ప్యాడ్‌పై సంతకం చేసి మరీ వారికి హామీ ఇచ్చారు. తలపై చేయి పెట్టుకుని ప్రమాణం కూడా చేశారు.

హయత్‌నగర్‌ పరిధిలోని గాయత్రీ నగర్‌లో రోడ్లు రోలర్‌ కోస్టర్‌ను తలపిస్తున్నాయి. ఇటీవలి వరదలతో మరింత అధ్వానంగా మారాయి. ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులకు కాలనీవాసులు ఆ రోడ్లను చూపిస్తే.. సొంత నిధులతో బాగు చేస్తామని హామీ ఇచ్చారు.


వరదలకు దెబ్బతిన్నవి


146 కి.మీ. బీటీ రోడ్లు, 

376 కి.మీ. సీసీ రోడ్లు.

522 కోట్లు పునరుద్ధరణకు కావాల్సిన నిధులు!


మల్కాజిగిరి.. హయత్‌ నగర్‌ మాత్రమే కాదు.. నగరంలోని చాలా కాలనీల్లో రోడ్లు రోలర్‌ కోస్టర్లను తలపిస్తున్నాయి. బండి మీద వెళుతున్నా.. కారులో వెళుతున్నా ఊయలలూగాల్సిందే! బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-12లో సెంచరీ ఆస్పత్రి సమీపంలో రహదారిపై గుంతలు ఉన్నాయి. రాత్రివేళ గుంతలు కనిపించక వాహనదారులు అదుపు తప్పి కింద పడుతున్నారు.

ఇటీవలి వానలకు కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం సుభాష్‌ నగర్‌లోని పలు కాలనీలు నీటమునిగాయి. వరదలతో పాడైన అక్కడి రోడ్లది ఇప్పటికీ అదే దుస్థితి. ఐదు సంవత్సరాలుగా జీహెచ్‌ఎంసీ కాలనీ రోడ్లపై పెట్టిన శ్రద్ధ తక్కువే. అధికారులు ప్రధాన రోడ్ల మరమ్మతులపై ‘ప్రత్యేక’ శ్రద్ధ పెట్టారు. వేసిన రోడ్లపైనే మళ్లీ మళ్లీ కార్పెటింగ్‌ కూడా చేశారు. కానీ, కాలనీలు, బస్తీల్లోని అంతర్గత రహదారులను పట్టించుకోలేదు. పలు కాలనీలు, బస్తీల్లో గుంతల రోడ్లు మరమ్మతులకు నోచుకోలేదు. ఇటీవలి వరదలకు అవి కాస్తా పెద్ద పెద్ద గోతులుగా మారితే.. కొత్తగా మరికొన్ని కాలనీల్లో గుంతలు పడ్డాయి. ఆయా రోడ్ల మరమ్మతులను యుద్ధ ప్రతిపదికన పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. 

యాప్రాల్‌ నుంచి జవహర్‌ నగర్‌ కార్పొరేషన్‌కు వెళ్లే రోడ్డు పూర్తి గుంతలతో నరకప్రాయంగా మారింది. అయినా, నాలుగేళ్లుగా ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఇక, ఇటీవలి వరదలకు నగరంలో 146 కిలోమీటర్ల మేర బీటీ, 376 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు పాడయ్యాయని గుర్తించారు. వీటి మరమ్మతు, పునరుద్ధరణకు రూ.522 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మరమ్మతులను నవంబరు 15కే పూర్తి చేయాలని నిర్ణయించారు. వరదలు తగ్గి నెల రోజులైంది. అయినా, ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో రహదారుల పునరుద్ధరణ జరగలేదు. దాంతో జీహెచ్‌ఎంసీ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుంతలున్నాయని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఎన్నికల నేపథ్యంలో నెల రోజులుగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్యాచ్‌ వర్కులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బీటీ మిక్సింగ్‌ చేయకుండా మట్టి పోసి చేతులు దులుపుకొంటున్నారు. గుంతల మరమ్మతులకు సంబంధించి ఫిర్యాదులు కూడా వందల్లోనే వస్తున్నాయి.


చింతల్‌బస్తీలో అధ్వానంగా మారిన రహదారికి మరమ్మతు చేపట్టినా.. పలు ప్రాంతాల్లో గుంతలు తేలాయి. లంగర్‌హౌజ్‌లోని వినాయకనగర్‌, బాగ్‌లింగంపల్లి- శంకర్‌మఠ్‌, చాంద్రాయణగుట్ట చౌరస్తా, విజయనగర్‌ కాలనీల్లో రోడ్లు కంకర తేలి ప్రమాదకరంగా పరిణమించాయి. శ్రీరమణ చౌరస్తా నుంచి రామంతాపూర్‌ వెళ్లే మార్గంలో ప్రధాన రహదారి, దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయం నుంచి పీఎన్‌టీ కాలనీ రోడ్డుదీ అదే దుస్థితి. గుంతల్లో పడి పలువురు ఆస్పత్రుల పాలవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రోడ్ల మరమ్మతు పనులు చేపడుతున్నారు. ‘‘ఎన్నికలు ఉన్నాయని ఈ మాత్రం పనులు చేస్తున్నారు. లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో..?’’ అని రామంతాపూర్‌కు చెందిన ఓ కాలనీ అధ్యక్షుడు పేర్కొన్నారు. అశాస్ర్తీయం.. అధ్వానం

బీటీ రోడ్ల నిర్మాణం శాస్ర్తీయంగా జరగడం లేదు. ఇంజనీరింగ్‌ ప్రమాణాల ప్రకారం ఇరువైపులా వరద నీరు వెళ్లేందుకు వీలుగా కేంబర్‌ ఉండేలా రహదారులు నిర్మించాలి. కానీ, నగరంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రధాన రహదారులు కూడా ఒకవైపు ఎత్తుగా.. మరోవైపు పల్లంగా వేస్తున్నారు. వర్షం వస్తే.. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీ నగర్‌ వెళ్లే మార్గంలో ఓవైపు పూర్తిగా నీళ్లు నిలిచిపోతాయి. ఇదే పరిస్థితి నగరంలో చాలాచోట్ల ఉంది. గుంత పడితే పూడ్చడం, ఎక్కువ మేరకు పాడైతే కార్పెటింగ్‌ చేయడం.. ఇలా పొరలు, పొరలుగా రోడ్లు నిర్మిస్తున్నారు. గుంతలు పడిన చోట సరైన ఆకారంలో తొలిచి.. అంతకుముందు ఉన్న రోడ్డు కంటే ఎక్కువ ఎత్తు లేకుండా మరమ్మతు పనులు చేయాలి. కానీ మరమ్మతు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు.


దీంతో  రహదారులు ఎగుడుదిగుడుగా మారుతున్నాయి. పై పై పూతలపై దృష్టి సారించిన జీహెచ్‌ఎంసీ.. రోడ్డు అడుగున పరిస్థితి ఎలా ఉందన్నది పట్టించుకోవడం లేదు. కాలగమనంలో కింద ఉండే మెటీరియల్‌ పొడిగా మారడంతో అందులోకి వర్షపు నీరు చేరి రహదారి పాడవుతోందని నిపుణులు చెబుతున్నారు. అధునాతన ఇంజనీరింగ్‌ పరిజ్ఞానంతో రీ మిల్లింగ్‌.. రీ సైక్లింగ్‌.. రీ స్ర్టెంథనింగ్‌ చేస్తూ రోడ్లు నిర్మించాలని సూచిస్తున్నారు.

- హైదరాబాద్‌ సిటీ, ఆంధ్రజ్యోతిఆరేళ్లు.. రూ.3 వేల కోట్లపైనే


గత ఐదేళ్లలో రోడ్ల మరమ్మతులకు రూ.3200 కోట్ల వరకూ ఖర్చు చేశారు. వీటిలో అత్యధికంగా ప్రధాన రహదారుల మరమ్మతులకే! కాలనీ రోడ్ల మరమ్మతులకు ఇందులో దాదాపు 25 శాతం మాత్రమే ఖర్చు చేశారు. దాంతో, సీజన్‌తో సంబంధం లేకుండా పలు ప్రాంతాల్లో రోడ్లు ఎప్పుడూ అధ్వానంగానే ఉంటున్నాయి.


‘‘హైదరాబాద్‌ రోడ్లతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. శస్త్ర చికిత్స చేయాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి’’ అని సీఎం కేసీఆర్‌ పలుమార్లు ఆదేశించినా మెరుగుదల కనిపించడం లేదు. కాకపోతే, నగరంలో 137 లింకు రోడ్లను ప్రతిపాదించారు. వాటిలో 33 రోడ్ల పనులు ప్రారంభించారు. 6 లింకు రోడ్లను ప్రారంభించారు. ఈ లింకు రోడ్ల విషయంలో మాత్రం స్థానికుల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది.2014 నుంచి చేసిన ఖర్చు 

             (రూ.కోట్లలో)

2014-15 492.13

2015-16 478.18

2016-17 299.07

2017-18 387.33

2018-19 661.52

2019-20 404.85

2020-21 500 (సుమారు)

మొత్తం     3223.08


Advertisement
Advertisement