ఫెడెక్స్‌ పోరాడి..!

ABN , First Publish Date - 2021-06-04T09:25:48+05:30 IST

హోరాహోరీగా సాగిన పోరులో థ్రిల్లింగ్‌ విజయం సాధించిన స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు.

ఫెడెక్స్‌ పోరాడి..!

ఫరోజర్‌, జొకో, స్వియటెక్‌  ముందంజ

గాయంతో బార్టీ రిటైర్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌


పారిస్‌: హోరాహోరీగా సాగిన పోరులో థ్రిల్లింగ్‌ విజయం సాధించిన స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఫెడెక్స్‌తోపాటు వరల్డ్‌ నంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌, రెండో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌, బెరెట్టి, మహిళల డిఫెండింగ్‌ చాంప్‌ ఇగా స్వియటెక్‌ కూడా ముందంజ వేశారు. మహిళల టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ గాయం కారణంగా టోర్నీ నుంచి అవుటవగా.. 9వ సీడ్‌ కరోనా ప్లిస్కోవా ఓటమితో ఇంటిముఖం పట్టింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో 8వ సీడ్‌ ఫెడరర్‌ 6-2, 2-6, 7-6(4), 6-2తో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై నెగ్గాడు. రెండో సెట్‌లో టైమ్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో ఫెడెక్స్‌కు చైర్‌ అంపైర్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.



ఆగ్రహించిన రోజర్‌..

అంపైర్‌తో వాదనకు దిగడంతో ఐదు నిమిషాలపాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ 6-3, 6-2, 6-4తో పాబ్లో కుయెవాస్‌ (ఉరుగ్వే)ను వరుస సెట్లలో ఓడించాడు. రెండో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 3-6, 6-1, 6-4, 6-3తో టామీ పాల్‌ (అమెరికా)పై, 9వ సీడ్‌ మాటియో బెరెట్టిని (ఇటలీ) 6-3, 6-3, 6-2తో ఫెడ్రికో కొరియాపై, 10వ సీడ్‌ డిగో ష్యార్జ్‌మన్‌ (అర్జెంటీనా) 6-4, 6-2, 6-4తో అల్జాజ్‌ బిడీని (స్లొవేనియా)పై గెలిచారు. ఇటలీ ఆటగాళ్ల మధ్య పోరులో జానిక్‌ సిన్నర్‌ 6-1, 7-5, 3-6, 6-3తో గియాన్లుకా మగర్‌ను ఓడించాడు. 14వ సీడ్‌ గేల్‌ మోన్‌ఫిల్స్‌ 0-6, 6-2, 4-6, 3-6తో మికాయిల్‌ యమర్‌ చేతిలో కంగుతిన్నాడు.  


బార్టీ అవుట్‌..:

2019 చాంపియన్‌ బార్టీ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది. తుంటి నొప్పి కారణంగా రెండో రౌండ్‌ మ్యాచ్‌ మధ్యలోనే రిటైరైంది. పోలెండ్‌ ప్లేయర్‌ మగ్దా లిన్నెట్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అమ్మాయి బార్టీ 6-1, 2-2తో ఉన్న సమయంలో తాను ఆడలేనని అంపైర్‌కు సంజ్ఞ చేసింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఆమె ఎడమ తొడకు భారీగా బ్యాండేజ్‌ వేసుకొని కనిపించింది. తొలి సెట్‌ నెగ్గిన తర్వాత మెడికల్‌ టైమౌట్‌ తీసుకొన్నా.. ఆ తర్వాత కూడా ఆటను కొనసాగించలేక పోయింది. కాగా, 8వ సీడ్‌ స్వియటెక్‌ 6-1, 6-1తో రెబెక్కా పీటర్సన్‌పై, గతేడాది రన్నరప్‌ సోఫియా కెనిన్‌ 7-5, 6-3తో హెయిలీ బాప్టిస్ట్‌ (అమెరికా)పై, ఐదో సీడ్‌ ఎలెనా స్విటోలినా 6-0, 6-4తో అన్నె లి (అమెరికా)పై, కరోలినా ముచోవా 6-3, 6-4తో వార్వరా లెప్‌చెంకో (అమెరికా)పై, మరియా సక్కారి 6-2, 6-3తో జాస్మిన్‌పై, కొకొ గాఫ్‌ 6-3, 7-6(1)తో వాంగ్‌ కియాంగ్‌పై నెగ్గారు. 9వ సీడ్‌ కరోలినా ప్లిస్కోవా 5-7, 1-6తో స్లోన్‌ స్టీఫెన్స్‌ చేతిలో ఓడింది. 


ప్రీ క్వార్టర్స్‌కు బోపన్న జోడీ..

డబుల్స్‌లో రోహన్‌ బోపన్న జంట ప్రీ క్వార్టర్స్‌కు చేరుకొంది. రెండో రౌండ్‌లో బోపన్న-ఫ్రాంకో కుగర్‌ (క్రొయేషియా) ద్వయం 6-4, 7-5తో అమెరికాకు చెందిన ఫ్రాన్సెస్‌ టైఫో-నికోలస్‌ మన్రోపై నెగ్గింది. 

Updated Date - 2021-06-04T09:25:48+05:30 IST