Myanmar genocide: ఫేస్‌బుక్‌పై రోహింగ్యాల పరువునష్టం దావా

ABN , First Publish Date - 2021-12-09T17:24:51+05:30 IST

మయోన్మార్ మారణహోమంపై రోహింగ్యా ముస్లింలు సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్‌బుక్‌పై 150 బిలియన్ డాలర్ల మేర పరువునష్టం దావా వేశారు...

Myanmar genocide: ఫేస్‌బుక్‌పై రోహింగ్యాల పరువునష్టం దావా

న్యూఢిల్లీ : మయోన్మార్ మారణహోమంపై రోహింగ్యా ముస్లింలు సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్‌బుక్‌పై 150 బిలియన్ డాలర్ల మేర పరువునష్టం దావా వేశారు.దీంతో ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌కు భారీగా ఎదురుదెబ్బ తగిలింది.ఫేస్‌బుక్‌ పోస్టుల వల్ల తమ జీవితాలు నాశనమయ్యాయని, తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ ఫేస్‌బుక్‌పై రోహింగ్యా శరణార్ధులు దావా వేశారు.  మయన్మార్‌లో తమకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్ వేదికగా విష ప్రచారం చేశారని...దీన్ని నియంత్రించడంలో ఫేస్‌బుక్ ఘోరంగా విఫలమైందనేది రోహింగ్యాలు ఆరోపించారు. తమపై హింసను ప్రేరేపించడంలో ఫేస్‌బుక్‌ కీలకపాత్ర పోషించిందని రోహింగ్యా శరణార్థులు ఆరోపించారు.


ఈ మేర యూకే, యూఎస్‌లలో రోహింగ్యా శరణార్ధులు శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. లండన్‌లోని ఫేస్‌బుక్ కార్యాలయానికి నోటీసులు పంపించారు. 2013వ సంవత్సరంలో తమకు వ్యతిరేకంగా పెట్టిన కొన్ని ఫేస్‌బుక్ పోస్టులను కోర్టుకు ఆధారాలుగా వారు సమర్పించారు. మయన్మార్‌లో ఫేస్‌బుక్‌కు లక్షల సంఖ్యలోనే యూజర్లు ఉన్నారు. సమాచారం షేరింగ్ ద్వారా ఫేస్‌బుక్ కు భారీగా ఆదాయం వచ్చింది. మయన్మార్‌లోని ముస్లిం మైనారిటీలైన రోహింగ్యాలపై హింస, ద్వేషపూరిత ప్రసంగాలను ప్రేరేపించడాన్ని నిరోధించడానికి తగినంతగా చేయలేకపోయామని 2018లో ఫేస్‌బుక్ అంగీకరించింది. మయన్మార్ మారణహోమం సమయంలో 2017వ సంవత్సరంలో మరణించిన రోహింగ్యాల సంఖ్య 10,000 కంటే ఎక్కువ ఉండవచ్చని వైద్య స్వచ్ఛంద సంస్థ మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ తెలిపింది.


2017 ఆగస్టులో మిలటరీ ఆక్రమణ సమయంలో చెలరేగిన హింసతో పెద్దఎత్తున మరణాలు, అత్యాచార ఘటనలు జరిగాయి. లక్షలమంది రోహింగ్యాలు దేశం విడిచి పారిపోయారు. ఈ పరిస్థితికి ఫేస్‌బుక్ కారణమనేది ప్రధాన ఆరోపణ.ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల దర్యాప్తు సంఘం కూడా 2018లో ఈ హింసకు ఫేస్‌బుక్ ప్రచారమే కారణమని తేల్చింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కూడా ఈ నేరారోపణలపై ఓ కేసు దాఖలు చేసింది. రోహింగ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఫేస్‌బుక్ ఖాతాల వివరాల్ని సమర్పించాలని అమెరికా ఫెడరల్ కోర్టు ఆదేశించింది. 


కాగా మయన్మార్ మిలిటరీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలను నిషేధించడంలో ఆలస్యం జరిగిందని ఫేస్ బుక్ అంగీకరించింది.అమెరికా ఇంటర్నెట్ చట్టంలోని సెక్షన్ 230 ప్రకారం నెటిజన్ పోస్ట్ చేసే కంటెంట్‌పై మాత్రమే ఫేస్‌బుక్‌కు నియంత్రణ ఉంటుంది.మూడవ వ్యక్తి చేసే పోస్టులను నియంత్రించలేదు. రోహింగ్యా శరణార్థులు వేసిన దావా వల్ల ఏం జరుగుతుందనేది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. 


Updated Date - 2021-12-09T17:24:51+05:30 IST