రోహిణికార్తె ఆగమనం

ABN , First Publish Date - 2020-05-25T09:42:03+05:30 IST

వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుండడంతో అన్నదాతలు సాగుకు సన్నద్ధం కానున్నారు.

రోహిణికార్తె ఆగమనం

వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధం 

నియంత్రిత పద్ధతిన పంటలు 

మొక్కజొన్న సాగు లేదు

పత్తి, కందిసాగు నో లిమిట్‌

వరిలో సన్నరకాలు\

రైతులకు అవగాహన సదస్సులు

జిల్లాలో వానాకాలం సాగు లక్ష్యం 2,58,965 ఎకరాలు 


 (ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) :వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుండడంతో అన్నదాతలు సాగుకు సన్నద్ధం కానున్నారు. సోమవారం నుంచి రోహిణి కార్తె మొదలు కానుండడంతో పొలంబాట పట్టనున్నారు. గత పంటల వ్యర్థాలు, పిచ్చిమొక్కలను తొలగించే పనుల్లో నిమగ్నం కానున్నారు.  వర్షాలు కురిసి భూమి అదునుకాగానే దుక్కులు దున్ని వరి, పత్తి, మొక్కజొన్న, కంది, పసుపు, జొన్న, పెసలు విత్తనాలు నాటడంతోపాటు వివిధ కూరగాయల పంటల సాగు చేపడతారు. గతేడాది వానాకాలం జిల్లా రైతులు వివిధ పంటలు సాగు చేసినా ఈ సారి ప్రభుత్వం పంటల విధానంలో మార్పు తీసుకురావడంతో దానికి అనుగుణంగా సన్నద్ధమవుతున్నారు.  మొక్కజొన్న వేయొద్దని పేర్కొనడంతో రైతులు ఇతర పంటలపై దృష్టిసారిస్తున్నారు. రైతులకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం కూడా సదస్సులు ఏర్పాటు చేస్తోంది. ఏ జిల్లాలో ఏ పంటకు ప్రాధాన్యం ఇవ్వాలో నిర్ణయించనుంది. సన్నరకం వరితోపాటు ప్రధానంగా పత్తి సాగు పెరగనుంది. నకిలీ విత్తనాలపై రైతులు జాగ్రత్త వహించే విధంగా జిల్లా వ్యవసాయ అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నారు.   ఈ సారి గోదావరి జలాలతో జిల్లాలో భూగర్భజలాలు పెరగడంతో సాగుపై రైతుల్లో ఆసక్తి పెరిగింది. 


కనుమరుగైన రోహిణికార్తె సంబరం

రోహిణికార్తె వచ్చిందంటే రైతులు సంప్రదాయబద్ధంగా ఎన్నో పనులు చేసే వారు. కనుమరుగైన రోహిణికార్తె సంబరంపై  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రోహిణీకార్తెకు వాతావరణమంతా చల్లబడి మబ్బులు కమ్ముకునేవని. నీళ్లు ఉన్న వారు విత్తనాలు వేసుకునే వారు. ఇప్పుడు దుక్కులతోనే సరిపోతోంది. కార్తె. కార్తెకు తీరొక్క విత్తనాలు వేసేవాళ్లమని, ఇప్పుడు కార్తెలను పట్టించుకునే పరిస్థితి లేదని రైతులు పేర్కొంటున్నారు. 


పునాస లక్ష్యం 2,58,965 ఎకరాలు 

  వానకాలం సాగు లక్ష్యాన్ని నిర్ణయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2,58,965 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేయనున్నారు.  వరి 1,30,300, పత్తి లక్షా 20వేల ఎకరాలు, ఇతర పంటలు 5,015 ఎకరాల్లో పంటలు వేయనున్నారు.  3,650 ఎకరాల్లో  మొక్కజొన్న వేస్తారని ముందుగా అంచనా వేసినా ప్రస్తుత నిబంధనలతో పంట మార్పిడి జరిగే అవకాశాలు ఉన్నాయి. వానాకాలం పంటలకు యూరియా 29,374 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 8,223 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 11,021 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 20,450 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించనున్నారు. ప్రస్తుత వర్షాకాలం పంటల్లో కొత్తదనం కనిపిస్తున్న రైతుల్లో మాత్రం నియంత్రిత సాగువిధానంపై అయోమయం నెలకొంది. పత్తి, కంది వంటి పంటలకు ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతోసాగు పెంచుకునే అవకాశం ఉంది. రైతులకు మరింత సేవలు అందించే దిశగా ఏఈవోలను నియమిస్తున్నారు. 

Updated Date - 2020-05-25T09:42:03+05:30 IST