రోహిత్‌శర్మే సరైనోడు: గవాస్కర్

ABN , First Publish Date - 2021-11-09T22:59:53+05:30 IST

టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకుంటున్నట్టు ప్రకటించినప్పటి నుంచి తదుపరి కెప్టెన్ ఎవరన్న

రోహిత్‌శర్మే సరైనోడు: గవాస్కర్

న్యూఢిల్లీ: టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకుంటున్నట్టు ప్రకటించినప్పటి నుంచి తదుపరి కెప్టెన్ ఎవరన్న దానిపై చర్చ జరుగుతూనే ఉంది. అయితే, ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు సుదీర్ఘకాలం ఆలోచించకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ఆడాల్సి ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. కోహ్లీ నుంచి పగ్గాలు అందుకునేందుకు రోహిత్ శర్మకు మించిన ఆటగాడు లేడని పేర్కొన్నాడు. 


ఐపీఎల్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఐదు టైటిళ్లు ఎగరేసుకుపోయిందని, వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును నడిపించేందుకు రోహిత్ సరైన వ్యక్తి అని వివరించాడు. టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయినంత మాత్రాన టీ20 జట్టు మొత్తాన్ని మార్చడం సరికాదని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాలోని పరిస్థితులను గుర్తు పెట్టుకుని దానికి అనుగుణంగా జట్టులో కొత్త కుర్రాళ్లకు చోటివ్వాలని సెలక్టర్లకు  సూచించాడు.  

Updated Date - 2021-11-09T22:59:53+05:30 IST