Abn logo
Oct 27 2021 @ 19:04PM

‘దళిత బంధు’ దేశానికే రోల్‌ మోడల్‌: జగదీష్‌రెడ్డి

యాదాద్రి: ‘దళితబంధు’ పథకం దేశానికి రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ‘దళితబంధు’ పథకం కింద 10 కుటుంబాలకు యూనిట్లను బుధవారం ఆయన పంపిణీ చేశారు. ఏడు గూడ్సు వాహనాలు, రెండు డోజర్లు, ఒక ప్యాసింజర్‌ ఆటోను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో డ్రైవర్లుగా ఉన్నవారు ‘దళితబంధు’ పథకంతో ఓనర్లుగా మారారని తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ పేరు దేశంలోనే మార్మోగుతోందని, కోటి ఎకరాల మాగాణి కల నెరవేరి ఆకుపచ్చ తెలంగాణగా మారిందన్నారు. సీఎం మేధస్సు నుంచి వచ్చిన ‘దళితబంధు’ పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపి రాబోయే రోజుల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని జగదీష్‌రెడ్డి అన్నారు.