‘రూఫ్‌టాప్‌’ అందాలు...

ABN , First Publish Date - 2020-11-29T17:01:14+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో... నాలుగ్గోడల నడుమ నలిగిపోయిన వారంతా కాస్త ఊపిరి పీల్చు కునేందుకు కాసేపైనా ఇంటి మిద్దె మీదకు చేరుకుంటారు. వీధులన్నీ జనసంచారం లేక వెలవెలపోతున్న వేళ... ప్రతీ ...

‘రూఫ్‌టాప్‌’ అందాలు...

లాక్‌డౌన్‌ సమయంలో... నాలుగ్గోడల నడుమ నలిగిపోయిన వారంతా కాస్త ఊపిరి పీల్చు కునేందుకు కాసేపైనా ఇంటి మిద్దె మీదకు చేరుకుంటారు. వీధులన్నీ జనసంచారం లేక వెలవెలపోతున్న వేళ... ప్రతీ ఇంటి డాబా కూడా పిల్లలతో, పెద్దలతో నిండిపోయి కనిపిస్తుంది. పిల్లలకు అక్కడే ఆటపాటలు... యువతీయువకుల ఫోన్‌ ఛాటింగ్‌కు అదే సరైన వేదిక... ఉద్యోగులు, వృత్తినిపుణులు లాప్‌టాప్‌తో బిజీగా గడిపేది అక్కడే... మహిళల కాలక్షేపం కూడా టెర్రస్‌, డాబాపైనే. దేశవ్యాప్తంగా ఇలాంటి దృశ్యాలకు కొదవేముంది. ఈ సరికొత్త ‘రూఫ్‌టాప్‌’ జీవితాన్ని ఒడిసి పట్టుకోవాలనుకున్నాడు హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన ఫొటోగ్రాఫర్‌ మధు గోపాల్‌రావు.

 కరోనా ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలంతా బిక్కు బిక్కుమంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లలో నుంచి కాలు బయటకు పెట్టకుండా ‘రూఫ్‌టాప్‌’నే ఆటవిడుపుగా ఎంచుకున్నారు. సో... ఈ కష్ట సమయంలో వారి జీవితాలు మిద్దెమీద కొత్త పాఠాలు నేర్చుకున్నాయి. ఒక డాబా మీద నుంచి చూస్తే మిగతా డాబాల మీద రకరకాల యాక్టివిటీస్‌ మనకు కనిపిస్తాయి. అలాంటి అనేక దృశ్యాలను మధు గోపాల్‌రావు తన కెమెరా కంటితో క్లిక్‌మనిపించాడు. ఆరునెలల కాలంలో అతడు సుమారు 5 వేల ఫొటోలు తీశాడు. వాటిలో కొన్నింటిని ఇటీవల ‘రూఫ్‌టాప్‌’ పేరిట ‘ఇండియన్‌ ఫొటో ఫెస్టివల్‌’లో ప్రదర్శించాడు. వాటిలో ఇంటి డాబాపై క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ వంటి ఆటలు ఆడుతున్న పిల్లలు, చిన్న చిన్న ప్లాస్టిక్‌ టబ్బుల్లో స్నానం చేస్తున్న చిన్నారులు, టెర్రస్‌ మీద ముచ్చట్లు పెడుతున్న ఆలుమగలు, కొడుక్కి హెయిర్‌కట్‌ చేస్తున్న తల్లి, డాబాపై నుంచే ఆన్‌లైన్‌ క్లాస్‌లకు అటెండ్‌ అవుతున్న విద్యార్థులు, సీరియస్‌గా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న ఉద్యోగులు, డాబాపైనే భోజనాలు వడ్డిస్తున్న మహిళలు... ఇలా అనేక కోణాల్లో లాక్‌డౌన్‌ దృశ్యాలు... మనకు సరికొత్త జీవితాన్ని పరిచయం చేస్తాయి. ‘‘లాక్‌డౌన్‌ మొద లవ్వగానే జనాలకు కొన్ని రోజుల పాటు ఏం చేయాలో అర్థం కాలేదు. రోజంతా నాలుగ్గోడల మధ్య గడపడం ఎవరికైనా కష్టమే. అలాంటి సమయంలో చాలా మందికి ఇంటి మిద్దెలు రిలీఫ్‌ను ఇచ్చాయి. లాక్‌డౌన్‌ అనేది ఒకవిధంగా కుటుంబసభ్యులను అందర్నీ ఒక దగ్గరకు తీసుకొచ్చింది. ఫొటోలు తీస్తున్న సమయంలో రూఫ్‌టాప్‌లు ఆకాశంలోని వీధుల్లాగా నాకు కనిపించాయి’’ అన్నారు మధు. 


Updated Date - 2020-11-29T17:01:14+05:30 IST