అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో ఢీకొన్న కోళ్లు

ABN , First Publish Date - 2022-01-15T01:23:24+05:30 IST

సంక్రాంతి సంబరాలు శుక్రవారం జిల్లాలో కోడి పందాలతో ఆరంభమయ్యాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో భోగి మంటలు వేసేందుకు ఆస్కారం లేకుండా పోయింది.

అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో ఢీకొన్న కోళ్లు

గుంటూరు: సంక్రాంతి సంబరాలు  శుక్రవారం జిల్లాలో కోడి పందాలతో ఆరంభమయ్యాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో భోగి మంటలు వేసేందుకు ఆస్కారం లేకుండా పోయింది. జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లో పెద్దఎత్తున కోడి పందాలు జరిగాయి. సంప్రదాయలను అడ్డంపెట్టుకుని వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కోడిపందాలు జోరుగా కొనసాగాయి. రేపల్లె ప్రాంతంలో నిర్వహించిన కోడి పందాలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి కూడా పందెంరాయుళ్లు తరలివచ్చారు. తొలిరోజున లక్షలాది రూపాయలు పందాలు జోరుగా సాగాయి. ఉదయం వర్షం కారణంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపల్లె మండలం 216 జాతీయ రహదారి పక్కన పేటేరు డొంకరోడ్డులో, భట్టిప్రోలు మండలం పల్లెకోనలో భారీగా కోడిపందాలు నిర్వహించారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో అధికారులు అటువైపు చూడలేదు. 


పేటేరు డొంకరోడ్డులో రెండు, పల్లెకోనలో ఆరు బరులను ఏర్పాటు చేసి పందాలను నిర్వహించారు. పల్లెకోనలో వీఐపీ బరి ఏర్పాటు చేసి మరీ పెద్దఎత్తున పందాలు కాశారు. బరుల వద్ద నెంబర్ల ఆట, గుండాట జోరుగా నిర్వహించారు. బరుల వద్ద నిబంధనలకు విరుద్ధంగా మద్యం స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో పందాలు నిర్వహించేందుకు బరులను సిద్ధం చేశారు. కొల్లిపర మండల పరిధిలోని  బొమ్మువానిపాలెంలో  తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జునతో కలిసి కోడి పందాలను ప్రారంభించారు. ఇక్కడ బరులను నాలుగు రోజుల క్రితం డీఎస్పీ సమక్షంలో ట్రాక్టర్లుతో దున్నేశారు. అయినా శుక్రవారం పందాలను నిర్వహించారు. 

Updated Date - 2022-01-15T01:23:24+05:30 IST