సెట్టింగ్ కాదు నిజమే! షూటింగ్ కోసం అంతరిక్షంలోకి నటి, దర్శకుడు!

ABN , First Publish Date - 2021-05-15T00:31:38+05:30 IST

మంచి లొకేషన్ల కోసం విదేశాలకో, లేకుంటే దేశంలోని మరో ప్రాంతానికో వెళ్లి సినిమా షూటింగ్ జరపడం అన్నిచోట్లా ఉంది.

సెట్టింగ్ కాదు నిజమే! షూటింగ్ కోసం అంతరిక్షంలోకి నటి, దర్శకుడు!

మాస్కో: మంచి లొకేషన్ల కోసం విదేశాలకో, లేకుంటే దేశంలోని మరో ప్రాంతానికో వెళ్లి సినిమా షూటింగ్ జరపడం అన్నిచోట్లా ఉంది. ఇక మన దేశ ‘వుడ్’లలో ఇది మరింత ఎక్కువ. పాటకైనా, ఫైట్‌కైనా విదేశీ లొకేషన్లే బెస్ట్ అనేది దర్శకుల భావన. ఈ విషయంలో రష్యా మరో అడుగు ముందుకేసింది. ఏకంగా అంతరిక్షంలోనే షూటింగ్ మొదలెట్టేందుకు సిద్ధమైపోయింది. కాస్మోస్‌లో మొదటి ఫీచర్ ఫిల్మ్‌ను షూట్ చేసేందుకు త్వరలోనే ఓ నటిని, దర్శకుడిని అంతరిక్షంలోకి పంపనున్నట్టు రష్యా నిన్న ప్రకటించింది. 


అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో షూటింగ్‌ కోసం ప్రముఖ నటుడు టామ్ క్రూయిజ్‌ను పంపిస్తామని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గతేడాది ప్రకటించింది. ఇప్పుడు రష్యా కూడా అంటువంటి ప్రకటనే చేసింది. నిజానికి అంతరిక్ష కార్యకలాపాల్లో తొలుత రష్యాదే పైచేయి అయినా ఆ తర్వాత క్రమంగా అమెరికా దూసుకుపోయింది. ఇక, రష్యా చిత్రీకరించనున్న ఈ ‘స్పేస్ డ్రామా’ పేరు ‘చాలెంజ్’. ప్రముఖ రష్యన్ నటి యులియా పెరెసిల్డ్ (36) ఇందులో నటించనుండగా, 37 ఏళ్ల దర్శకుడు క్లిమ్ షిపెన్కో దర్శకత్వం వహించనున్నట్టు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కోమోస్ తెలిపింది. 


అంతరక్షంలో షూటింగ్ అంటే మాటలు కాదు కదా.. జీరో గ్రావిటీలో షూటింగ్ అంటే మామూలు విషయమా! అందుకనే నటుడికి, దర్శకుడికి తొలుత శిక్షణ ఇవ్వనున్నారు. సెంట్రిఫ్యూజ్ విమానాల్లో జీరో గ్రావిటీపై శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు రోస్కోమోస్ అధిపతి డిమిట్రీ రోగోజిన్‌తోపాటు ప్రభుత్వ చానల్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 


అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికాతో పోటీపడుతున్న రష్యా స్పేస్ టూరిజం ప్రోగ్రామును కూడా ప్రారంభించింది. ఈ ఏడాది డిసెంబరులో జపాన్ బిలియనీర్ యుసాకు మేజావా (45)ను అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్తామని ప్రకటించింది. 

Updated Date - 2021-05-15T00:31:38+05:30 IST