Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద సమయంలో రోశయ్య బాసట

  1. అనేక అభివృద్ధి పనులకు నిధులు 
  2. స్మరించుకుంటున్న జిల్లా ప్రజలు, నాయకులు


కర్నూలు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య శనివారం మృతి చెందారన్న వార్త జిల్లాలోని ఆయన అభిమానులు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. ముఖ్యమంత్రిగా జిల్లాలో ఆయన తనదైన ముద్ర వేశారు. 2009 అక్టోబరులో కర్నూలును వరదలు ముంచెత్తినపుడు ఆయన స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంది. హంద్రీ, తుంగభద్ర నదులు  ఉప్పొంగడంతో కర్నూలు నగరంలోని ఇళ్లన్నీ నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎటు చూసినా వరద నీరే. శ్రీశైలం వెనుక జలాల కారణంగా ముంపు సమస్య మరింతగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో రోశయ్య ముఖ్యమంత్రిగా అన్నీ తానై నడిపించారు. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టి నెలన్నర కూడా కాలేదు. కర్నూలులో పర్యటించి బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపారు. ఆయన తీసుకున్న చర్యలతో వరద నష్టం చాలా వరకు తగ్గింది. వరద కారణంగా దెబ్బతిన్న నగరాన్ని తక్కువ సమయంలోనే మునుపటి స్థితికి చేర్చారు. అందుకోసం రూ.270 కోట్లు విడుదల చేశారు. రోడ్లు, ఇతర మౌలిక వసతులు, ఆధునిక హంగులను కర్నూలుకు సమకూర్చారు. అదే సంవత్సరం డిసెంబరులో వరద సహాయక పనులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వచ్చారు. ఆ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. చిల్డ్రన్స్‌ పార్కులో మహిళల కోసం అత్యాధునిక పరికరాలతో కూడిన జిమ్‌ను ప్రారంభించారు. ఆయన జిల్లాకు చేసిన సేవలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. శ్రీశైలం, మహానంది, మంత్రాలయానికి కూడా రోశయ్య పలుమార్లు వచ్చారు.


మూడు రోజులు సంతాప దినాలు: కలెక్టర్‌


కర్నూలు(కలెక్టరేట్‌), డిసెంబరు 4: ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు సంతాపం నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు. జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలో, జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌, ఆర్‌ఐవో, రిజిస్ట్రార్‌ రాయలసీమ యూనివర్సిటీ తదితర విద్యాసంస్థల్లో సంతాపం నిర్వహించాలని  కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement
Advertisement