బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఇదే మా నివాళి!

ABN , First Publish Date - 2021-12-05T05:19:03+05:30 IST

బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఇదే మా నివాళి!

బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఇదే మా నివాళి!
సీఎంగా ఉన్నప్పుడు జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో రోశయ్యతో సిక్కోలు నేతలు .. (ఫైల్‌)

- సిక్కోలుతో రోశయ్యకు విడదీయరాని బంధం

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య హఠాన్మరణం సిక్కోలు వాసులను కలిచివేసింది. మంత్రిగా, శాసనమండలి, శాసనసభ విపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా పలు పదవులు చేపట్టిన రోశయ్యకు జిల్లాతో విడదీయరాని బంధం ఉంది. ఆయన గురువు ఆచార్య ఎన్జీరంగా జిల్లా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. నాటి తరం నేతలు గౌతు లచ్చన్న, మజ్జి తులసీదాస్‌, బొడ్డేపల్లి రాజగోపాలరావుతో  పాటు ఐదు దశాబ్దాలుగా మంత్రులు, ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జిల్లాలో జరిగిన ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో సైతం ఆయన పాల్గొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న నేతలు..ఆయన మృతికి సంతాపం తెలిపారు. 


గౌతు కుటుంబమంటే ప్రత్యేక అభిమానం

పలాస: రోశయ్యకు గౌతు లచ్చన్న కుటుంబంతో విడదీయరాని బంధం ఉంది. రైతు బాంధవుడు ఆచార్య ఎన్‌జీ రంగా శిష్యుల్లో రోశయ్య ఒకరు. రంగా లచ్చన్న ప్రోత్సాహంతో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపీగా పోటీచేశారు. నాడు లచ్చన్న రోశయ్యల మధ్య స్నేహం కుదిరింది. గౌతు లచ్చన్న మరణానంతరం... ఆయన శతజయంతి ఉత్సవానికి నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, మండలి చైర్మన్‌ చక్రపాణి తదితరులు హాజరుకావడం వెనుక రోశయ్య కృషి ఉంది. అటు తరువాత ఆయన కుమారుడు, మాజీ మంత్రి గౌతు శ్యామసుందరశివాజీ, ఆయన సతీమణి విజయలక్ష్మి, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషతో సత్సంబంధాలు కొనసాగించారు. రోశయ్య మృతి పై  గౌతు శివాజీ, శిరీష సంతాపం తెలిపారు. రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ కోర్‌కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్‌ కణితి విశ్వనాథం రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, పీరుకట్ల విఠల్‌రావు తదితరులు సంతాపం తెలిపారు.


స్నేహానికి విలువ

కవిటి: రోశయ్య స్నేహానికి చాలా విలువ ఇచ్చేవారు. నాడు పీసీసీ సభ్యుడిగా వ్యవహరించిన బెజ్జిపుట్టుగ గ్రామా నికి చెందిన మాదిన సూర్యనారాయణకు రోశయ్యతో స్నేహ సంబంధాలుండేవి. నాడు గౌతు లచ్చన్న సహచరుడిగా ఉద్దానంలో పర్యటిస్తే సూర్యనారాయణను తప్పకుండా కలిసేవారు. కుటుంబ యోగక్షేమాలను తెలుసుకున్నారు. సూర్యనారాయణ మరణానంతరం ఆయన కుమారుడు రవికి ఫోన్‌చేసి సంతాపం తెలిపారంటే స్నేహానికి ఆయనిచ్చే విలువ అర్ధమవుతుంది.


పార్థివదేహం వద్ద నివాళి

కోటబొమ్మాళి : రోశయ్య పార్ధివ దేహాం వద్ద నివాళులర్పించారు టీడీపీ సీనియర్‌ నేత, కోటబొమ్మాళికి చెందిన పారిశ్రామికవేత్త బోయిన గోవిందరాజులు. శనివారం హైదరాబాద్‌లోని రోశయ్య గృహంలో మృతదేహం వద్ద గోవిందరా జులు నివాళులర్పించారు. ఆయన కుటుంబస భ్యులకు సంతాపం తెలిపారు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 


సంతాపాల వెల్లువ

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/టెక్కలి/నరసన్నపేట/పోలాకి/ రాజాం/ఆమదాలవలస

- రోశయ్య మరణం బాధాకరమని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఆయనతో పనిచేసిన రోజులు మరువరానివన్నారు. 

- మంత్రిగా, ప్రజాప్రతినిధిగా రోశయ్య శాసనసభలో హుందాగా వ్యవహరించేవారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు అన్నారు. రాజకీయాలకతీ తంగా వ్యవహరించేవారని చెప్పారు.

- సహచర మంత్రిగా, సీఎంగా రోశయ్య క్యాబినెట్‌లో మంత్రిగా ఆయనతో పనిచేయడం అదృష్టంగా భావి స్తున్నాని.. ఆర్థిక మంత్రిగా విశేష సేవలందించారని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. 

- ఆర్థిక మంత్రిగా రోశయ్య చేపట్టిన సంస్కరణలు అభినందనీయమని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌అన్నారు. ఆయన సేవలు మరువరానివన్నారు. 

- వివాద రహితుడిగా, రాజకీయాల్లో వర్గరహితుడిగా రోశయ్యకు మంచి పేరు ఉందని..ఆయన అకాల మృతి తీరని లోటని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారా యణ, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి సంతాపం తెలిపారు.

- రోశయ్య అపర చాణుక్యుడని, ఆయన మృతి తీరని లోటని కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ కిల్లి కృపారాణి సంతాపం తెలిపారు. 

- సభలో రోశయ్య వ్యవహరించే తీరు ఆకట్టుకుంటుం దని మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎమ్మెల్యే జోగులు అభివర్ణించారు. 

- పార్టీలకతీతంగా అందరితో చనువుగా వ్యవహరించే మంచి వ్యక్తి రోశయ్య అని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. 

- రోశయ్యతో తమ కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని సీనియర్‌ నాయకుడు పాలవలస రాజశేఖరం అన్నారు. ఆయన అకాల మృతిపై ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-12-05T05:19:03+05:30 IST