అంగన్వాడీల రోస్టర్ తయారీలో నలుగుతున్న అధికారులు
అధికారులు, నేతల ఒత్తిళ్లతో సతమతం
ఐదు రోజులైనా కొరవడిన స్పష్టత !
అనంతపురం వైద్యం, నవంబరు 27: అంగన్వాడీ నియామకాలు పేరు వింటేనే సీడీపీఓలు బెంబేలెత్తుతున్నారు. ఖాళీలకు రోస్టర్ కేటాయింపు నిద్ర లేకుండా చేస్తోంది. రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చినా రోస్టర్ వివాదం ముదురు పాకాన పడింది. ఓవైపు అధికారులు రోస్టర్ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటున్నారు. మరోవైపు నియోజకవర్గాలలో ఉన్న పోస్టులకు ఫలానా కేంద్రానికి ఫలానా రోస్టర్ ఇవ్వాలని పట్టుపడుతున్నారు. అధికారులు, నేతలు తలోదారి వెళుతున్నారు. ఐదు రోజులుగా ఈ రోస్టర్లపై కలెక్టర్ ఆదేశాల మేరకు జేసీలు డాక్టర్ సిరి, గంగాధర్ గౌడ్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 17 ప్రాజెక్టుల నుంచి సీడీపీఓలను జిల్లా కేంద్రానికి రప్పించుకొని ఆదేశాలు జారీ చేస్తూ ఆ మేరకు సమాచార నివేదికలు తయారు చేయిస్తున్నారు. 844 ఖాళీలు చూపారు. ఇందులో 136 ప్రధాన కార్యకర్తల పోస్టులు, 63 మినీ కార్యకర్తల పోస్టులు, 645 ఆయా పోస్టులు ఉన్నాయి. వీటికి ఆయా కేంద్రాలలో జనాభా ప్రాతిపదికన రోస్టర్ పాయింట్ కేటాయించాలని కలెక్టర్, జేసీలు నిర్ణయించారు. ఆ మేరకు సీడీపీఓలు కుస్తీ పట్టి నివేదికలు తయారు చేశారు. రోజూ ఉదయం నుంచి రా త్రి వరకు ఐదు రోజులుగా ఇదే పనిలో ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు డ్వామా కార్యాలయంలో ఉండిపోయారు. ప్రజాప్రతినిధుల నుంచి అదే స్థాయిలోనే రోస్టర్ పాయింట్ల కేటాయింపుపై ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో ఉన్నతాధికారులు సైతం ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారని తెలుస్తుంది. అయితే సీడీపీఓలను శుక్రవారం కూడా పిలిపించి రాత్రి వరకు ఈ రోస్టర్లపైనే వివిధ రకాలుగా నివేదికలు తయారు చేయించినట్లు సమాచారం. రోజుకొక నిర్ణయంపై సీడీపీఓలు అధికారులు, ప్రజాప్రతినిధులు మధ్య నలిగిపోతున్నారు. ఎవరి మాట వినాలో అర్థం కాక ఆవేదన, ఆందోళనలో పడిపోయారు. శుక్రవారం రాత్రి వర కు ఈ రోస్టర్లపై రీ వెరిఫికేషన్ జరిగిందని స్పష్టత వచ్చిందని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. సీడీపీఓలు మాత్రం ఈ రోస్టర్ తంటా ఎప్పుడు తెగుతుందోనని టెన్షన్ పడుతున్నారు.