కరోనా కాటు...

ABN , First Publish Date - 2021-06-14T06:16:11+05:30 IST

ఒకప్పుడు వ్యాపారులు, రైతులు మామిడికాయలతో సందడిగా ఉంటే రైల్వేకోడూరు మండీలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. కుళ్లిన మామిడికాయలతో మండీలు నిండిపోతున్నాయి. మామిడి రైతులపై కరోనా దెబ్బ తీవ్రంగా పడింది.

కరోనా కాటు...
గుంజనేరులో పారవేసిన మామిడి కాయలు

కుళ్లిపోతున్న మామిడికాయలు

ట్రాక్టర్లలో కాయలను నదిలో పారవేస్తున్న వైనం

రోజుకు 50 లారీల కాయలను కూడా అమ్ముకోలేని స్థితి

బేనీషా కాయలకు దోమపోటు

ఆదుకోవాలని ప్రభుత్వానికి రైతులు, వ్యాపారుల విజ్ఞప్తి 

రైల్వేకోడూరు, జూన్‌ 13: ఒకప్పుడు వ్యాపారులు, రైతులు మామిడికాయలతో సందడిగా ఉంటే రైల్వేకోడూరు మండీలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. కుళ్లిన మామిడికాయలతో మండీలు నిండిపోతున్నాయి. మామిడి రైతులపై కరోనా దెబ్బ తీవ్రంగా పడింది. ప్రతి ఏడాది  100 నుంచి 200 కోట్ల రూపాయలు జరిగే మామిడి వ్యాపారం ప్రస్తుతం 50 కోట్ల రూపాయలు జరగడం గగనంగా మారిందని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు. మామిడి సీజన్‌ చరిత్రలో ఇటువంటి వ్యాపారాన్ని చూడలేదని పలువురు పేర్కొంటున్నారు. రైల్వేకోడూరు ప్రాంతం ఎక్కువగా మామిడి పైనే రైతులు, వ్యాపారులు ఆధారపడి ఉన్నారు. ఇతర నగరాల్లోకి మామిడి కాయలను తరలించలేని స్థితి ఏర్పడింది. గతంలో సీజన్‌లో రోజుకు 200 నుంచి 300 లారీల్లో కాయలను ఇతర నగరాలకు ఎగుమతి చేసేశారు. ప్రస్తుతం కరోనాతో రోజూ 50 లారీలు కూడా అమ్ముకోలేని స్థితి ఏర్పడింది. ఉన్న కాయలను అమ్ముకోలేక యార్డులోనే మాగి కుళ్లిపోతున్నాయి. ప్రతిరోజూ ట్రాక్టర్లలో కాయలను గుంజన, మేకలగుంతేరు నదుల్లో పారేస్తున్నారు. బేనీషా కాయలకు దోమపోటు పట్టింది. దీంతో కాయలు తోటల్లోనే దెబ్బతింటున్నాయి. కరోనా కాకుండా దోమల పోటు కూడా రైతులను నిలువునా ముంచేస్తోంది. బేనీషా టన్ను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పడిపోయింది. నాటు రకాలు టన్ను రూ.3 నుంచి 5 వేలు, తోతాపూరి టన్ను రూ.7 వేలు, నీలం రూ. 6 నుంచి రూ.12 వేలు, రుమాణి టన్ను రూ.5 నుంచి రూ.10 వేలు అమ్ముతున్నాయి. కోసిన కాయలు మార్కెట్‌కు చేరేలోపు టన్నుకు రూ.3 వేలు ఖర్చు వస్తుందని రైతులు తెలిపారు. కూలీలు కూడా గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. ఢిల్లీ, రాజస్థాన్‌, యూపీ, ఎంపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్‌, కేరళ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా కరోనా ఉండడంతో అక్కడి వ్యాపారుల రైల్వేకోడూరుకు రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. జ్యూస్‌ పరిశ్రమలకు అతి తక్కువ ధరలకు కాయలను తీసుకుంటున్నారని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు. జ్యూస్‌కు ఉపయోగించే కాయలను టన్ను రూ.10 వేలకు తీసుకుంటే కొంత మేరకు లాభం ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. రైల్వేకోడూరు బేనీషా అంటే పెట్టింది పేరు అలాంటి కాయలకు ఈ ఏడాది దోమ పోటు వచ్చింది. దీంతో కాయలు పూర్తిగా తోటల్లోనే దెబ్బతింటున్నాయి. మామిడి సీజన్‌లో చేసిన అప్పులు తీరిపోతాయని అనుకున్న తరుణంలో సెకెండ్‌ వేవ్‌ కరోనాతో మామిడి రైతు పూర్తిగా డీలా పడ్డాడు. రైల్వేకోడూరు మార్కెట్‌ యార్డులో దాదాపు 42 మండీలు ఉన్నాయి. ప్రతి మండీ నుంచి దెబ్బతిన్న, మాగిన, కుళ్లిన కాయలను నదుల్లో పారవేస్తున్నారు. ఒకవైపు మామిడి రైతులు నష్టపోతున్నా పాలకులు చోద్యం చూస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని జ్యూస్‌ పరిశ్రమలకు గిట్టుబాటు ధరలు కల్పించి మామిడి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.


ఇలాంటి ధరలు ఎన్నడూ చూడలేదు

- పి. వెంకట్రాజు, సూరపురాజుపల్లె, రైతు

ఇలాంటి ధరలు ఎన్నడూ చూడలేదు. మామిడి సీజన్‌ వచ్చిందంటే పండుగ వాతావరణం ఉంటుంది. కరోనాతో ఎండగ వాతావరణం ఏర్పడింది. లక్షలు లాభాలు సాధించే బడా రైతులు కుప్పకూలిపోయారు. ఇదే స్థితిలో వ్యాపారులు ఉన్నారు. చేసిన అప్పులు మామిడి సీజన్‌లో తీరిపోయి నాలుగు రాళ్లు వేనకేసుకునే రైతుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. కుళ్లిపోయిన మామిడి కాయలను చూసి కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.


జ్యూస్‌ పరిశ్రమలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి

- మున్వర్‌, వ్యాపారి, రైల్వేకోడూరు

జ్యూస్‌ పరిశ్రమలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. కరోనా సమయంలో ఇతర నగరాలకు ఎగుమతి లేదు. కావున ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని జ్యూస్‌ కాయలు టన్ను రూ.10 వేలు ధర కల్పిస్తే ఇటు రైతులు, అటు వ్యాపారులు కొంత మేరకు నష్టం నుంచి బయటపడతారు. రైతుల కష్టానికి ప్రతిఫలం లేదు. వ్యాపారికి లాభం లేదు. తోతాపూరి తదితర రకాలను జ్యూస్‌ పరిశ్రమలకు పంపించవచ్చు. కావున ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.


దోమపోటు నిలువునా ముంచేసేంది

- తిమ్మిశెట్టిపల్లె మణి, రైతు, వ్యాపారి, తిమ్మిశెట్టిపల్లె

దక్షిణ భారతదేశంలోనే బేనీషాకు పేరుంది. ఇలాంటి కాయలను ప్రజలు ఇష్టపడి తింటారు. ఈ ఏడాది మళ్లీ కరోనా వచ్చి ఎలా వ్యాపారాలను నాశనం చేసిందో అలాగే బేనీషా కాయలకు దోమపోటు వచ్చి రైతులను నిలువునా ముంచింది. ఇలాంటి వ్యాపారం ఎప్పుడూ చూడలేదు. ప్రతి ఏటా రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్లు వ్యాపారం నిర్వహించే వారు. అయితే ఈ ఏడాది 50 కోట్ల వ్యాపారం సాగేటట్లు లేదు. లారీ బాడుగలు పెరిగిపోయాయి.

Updated Date - 2021-06-14T06:16:11+05:30 IST