బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2021-06-15T07:43:26+05:30 IST

ప్రజలకు సేవచేస్తూ సుపరిపాలన అందించాల్సిన ప్రభుత్వాలు బాధ్యల నుంచి తప్పుకుంటున్నాయని పలువురు నేతలు విమర్శించారు. సోమవారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సింహపురి పౌరసమాఖ్య రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించింది.

బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ప్రభుత్వాలు
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న నేతలు.

పన్నుల పెంపుపై రేపటి నుంచి నిరసన

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సమాఖ్య నేతలు

నెల్లూరు(వైద్యం), జూన్‌ 14 : ప్రజలకు సేవచేస్తూ సుపరిపాలన అందించాల్సిన ప్రభుత్వాలు బాధ్యల నుంచి తప్పుకుంటున్నాయని పలువురు నేతలు విమర్శించారు. సోమవారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సింహపురి పౌరసమాఖ్య రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించింది. సమాఖ్య, సీఐటీయూ, డీవైఎఫ్‌ఐ నేతలు శ్రీనివాసులు, నాగేశ్వరరావు, ప్రసాద్‌ మాట్లాడుతూ కరోనాతో కష్టాల్లో ఉన్న పట్టణ ప్రజలపై సంస్కరణల పేరుతో ఆర్థికభారం మోపటం తగదన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థకు ఎన్నికలు జరగలేదని, పాలక వర్గం లేదని, ఈ నేపథ్యంలో కౌన్సిల్‌ తీర్మానం లేకుండా ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ప్రజలపై యూజర్‌ చార్జీలు మోపటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇంటిపన్ను 15శాతానికి మించి పెరగదని చెబుతున్న ప్రభుత్వం ఆ విషయాన్ని చట్టంలో ఎందుకు పొందుపరచలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్వయం సమృద్ధి సాధించిన స్థానిక సంస్థల అధికారాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గండికొడుతున్నాయన్నారు. వీటన్నింటిపై ఈ నెల 16, 17 తేదీలలో వార్డు సచివాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు. సింహపురి పౌరసమాఖ్య నగర అధ్యక్షుడు శివశంకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అవాజ్‌ కార్యదర్శి రషీద్‌, డీవైఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు ఫయాజ్‌, ఆటోకార్మిక సంఘం నగర కార్యదర్శి మురళి, సింహపురి పౌరసమాఖ్య నేతలు నరసింహా, సుధాకర్‌రెడ్డి, ఆనంద్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T07:43:26+05:30 IST