స్వర్ణ చతుర్భుజిని చుట్టేసి..గిన్నిస్‌ రికార్డులు పట్టేసి!

ABN , First Publish Date - 2021-04-09T06:35:05+05:30 IST

లేహ్‌ నుంచి మనాలి వరకు.. 472 కిలోమీటర్ల దూరం.. గడ్డకట్టే చలి.. పర్వత ప్రాంతం.. బాగా పాడైపోయిన ఎగుడు దిగుడు రోడ్లు..

స్వర్ణ చతుర్భుజిని చుట్టేసి..గిన్నిస్‌ రికార్డులు పట్టేసి!

సోలో సైక్లింగ్‌లో రెండు ప్రపంచ రికార్డులు 

సృష్టించిన భారత ఆర్మీ అధికారి


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: లేహ్‌ నుంచి మనాలి వరకు.. 472 కిలోమీటర్ల దూరం.. గడ్డకట్టే చలి.. పర్వత ప్రాంతం.. బాగా పాడైపోయిన ఎగుడు దిగుడు రోడ్లు.. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య సైకిల్‌ తొక్కి.. కేవలం 35 గంటల 25 నిముషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేశారు మన ఆర్మీ అధికారి. లెఫ్టెనెంట్‌ కల్నల్‌ భరత్‌ పన్ను.. పట్టుదల ముందు ప్రపంచ రికార్డు తలవంచింది. ఆయన సాధించిన ఈ ఘనతకు (పర్వత ప్రాంతాల్లో వేగవంతమైన సోలో సైక్లింగ్‌) గిన్నిస్‌ రికార్డు సొంతమైంది. 2020 అక్టోబరు 10న ఆయన ఈ రికార్డు నెలకొల్పారు. ఇందుకోసం ఆయన 20 రోజుల పాటు లడఖ్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. అక్కడితో ఆగని భరత్‌.. వెంటనే మరో ప్రపంచ రికార్డుకు శ్రీకారం చుట్టారు. ఈ సారి ఏకంగా స్వర్ణ చతుర్భుజినే లక్ష్యంగా చేసుకున్నారు. ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద సోలో సైక్లింగ్‌ మొదలెట్టి.. ముంబై, చెన్నై, కోల్‌కతా మీదుగా తిరిగి ఢిల్లీ చేరుకోవడాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రారంభించి.. కేవలం 14 రోజుల, 23 గంటల, 52 నిముషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ క్రమలో ఆయన మొత్తం 5,942 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కి.. కొత్త గిన్నిస్‌ రికార్డును నెలకొల్పారు. ఇలా.. ఒకే ఏడాది, ఒకే నెలలో 20 రోజుల వ్యవధిలో రెండు ప్రపంచ రికార్డులు సృష్టించి గిన్నీ్‌సబుక్‌లోకి ఎక్కిన లెఫ్టెనెంట్‌ కల్నల్‌ భరత్‌ పన్నుపై ఆర్మీ అధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ రెండు రికార్డులకు సంబంధించి అధికారిక ధ్రువీకరణ పత్రాలను భరత్‌ పన్ను ఇటీవలే అందుకున్నారు.  

Updated Date - 2021-04-09T06:35:05+05:30 IST