Abn logo
Sep 26 2021 @ 07:45AM

కొనసాగుతున్న రౌడీల వేట

               - రెండు రోజుల్లో 2,512 మంది అరెస్టు


చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్‌ డిసార్మ్‌’ పేరుతో రెండురోజులపాటు కొనసాగిన రౌడీల వేటలో 2512 మందిని అరెస్టు చేసినట్టు డీజీపీ శైలేంద్రబాబు ప్రకటించారు. మదురైలో దక్షిణ మండల పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సమావేశానంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ... మదురై జోన్‌ పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తుండటంతో నేరాల సంఖ్య తగ్గిందని, శాంతిభద్రతల పరిస్థితులు మెరుగ్గా వున్నాయని తెలిపారు. రాష్ట్రమంతటా రెండు రోజులపాటు రౌడీల వేట కొనసాగించి 16,370ల మందిని నిర్బంధంలోకి తీసుకుని విచారణ జరిపామని, వీరిలో పలు నేరాలతో సంబంధాలున్న 2512 మంది రౌడీలను అరెస్టు చేసి, 733 మందిని జైళ్లకు తరలించామని వివరించారు. ఈ రౌడీల నుంచి తొమ్మిది వందలకు పైగా కత్తులు, వేటకొడవళ్ళు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లఘించిన 1927 మంది పాత నేరస్థుల నుంచి సత్ప్రవర్తన సర్టిఫికెట్లను వాపసు తీసుకున్నామని, వీరివద్ద విచారణ జరుపుతున్నామని చెప్పారు. హత్య, దారి దోపిడీలు, చోరీలకు పాల్పడుతున్న రౌడీలను అణచివేస్తామని డీజీపీ హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సత్ప్ర వర్తన ద్వారా జైలు నుంచి విడుదలైన పాత నేరస్థులందరిపైనా నిఘా తీవ్రతరం చేశామని, ఎవరైనా నేరాలకు పాల్పడితే వారి సత్ప్రవర్తన సర్టిఫికెట్లను వాపసు చేసుకుని జైలుకు తరలిస్తామని ఆయన చెప్పారు. హత్య, చోరీ, దోపిడీ కేసులపై పోలీసులు త్వరిత గతిన దర్యాప్తు జరిపి నేరస్థులకు శిక్షపడేలా చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.