భయం.. భయం..రెచ్చిపోతున్న గ్యాంగ్‌లు

ABN , First Publish Date - 2022-01-18T16:51:26+05:30 IST

నగరంలో రౌడీ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. రాత్రిపూట అల్లరిమూకల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే స్థానికుల నుంచి

భయం.. భయం..రెచ్చిపోతున్న గ్యాంగ్‌లు

పెరుగుతున్న హత్యలు

గల్లీల్లో ఘర్షణలు

రెచ్చిపోతున్న గ్యాంగ్‌లు

రౌడీషీట్‌ తెరిచేందుకు కసరత్తు


హైదరాబాద్‌ సిటీ: నగరంలో రౌడీ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. రాత్రిపూట అల్లరిమూకల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే స్థానికుల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని నగర సీపీ సీవీ ఆనంద్‌ ఇటీవల సౌత్‌జోన్‌ పరిఽధిలోని పాత పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా వ్యాఖ్యానించారు. రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రౌడీగ్యాంగుల ఆగడాల గురించి సీపీ చెప్పిన మాటలు అక్షరాల నిజమని ఇటీవల జరిగిన పలు సంఘటనలు నిరూపిస్తున్నాయి. హైదరాబాద్‌ సిటీ పరిధిలోనే కాదు.. ట్రై కమిషనరేట్స్‌ పరిధుల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కొత్త సంవత్సరం ఆరంభం రోజే ఎల్‌బీనగర్‌లో హత్య జరగగా.. జనవరిలో ఇప్పటి వరకు ఏడు హత్యలు జరిగాయి. గొడవలు, కొట్లాటలు కోకొల్లలు. 


19 ఏళ్లకే గ్యాంగ్‌ వార్‌

కొత్త సంవత్సరం రోజున ఎల్‌బీనగర్‌లో బహిరంగ ప్రదేశంలో మద్యం తాగిన రెండు గ్యాంగ్‌లు.. పాతకక్షలను గుర్తుకు తెచ్చుకుని ఘర్షణ పడ్డారు. స్టిక్స్‌, రాడ్లతో రోడ్డుమీదే కొట్టుకున్నారు. ఈ దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. గ్యాంగ్‌ వార్‌లో పాల్గొన్న వారంతా 19-23 ఏళ్ల వయసు వారే కావడం గమనార్హం.


బైక్‌లపై వెంటాడి దాడి

ఎల్‌బీనగర్‌లో హత్య జరిగిన మరుసటి రోజే అదే ప్రాంతంలో మరో కాలనీలో డిగ్రీ చదువుతున్న యువకులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. చిన్న విషయంలో సీనియర్లు, జూనియర్లకు మధ్య జరిగిన ఘర్షణ దాడులకు దారితీసింది. కొందరు యువకులు రాత్రిపూట బైక్‌లపై ఓ యువకుడిని వెంటాడారు. ఓ ఇంట్లో తలదాచుకున్నా కొట్టారు. పోలీసులు అల్లరిమూకల ఆటకట్టించారు.


 గాంధీనగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఓ కాలనీలో మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పాతకక్షలతో ఇరువర్గాలు కొట్టుకున్నారు. దాంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘర్షణ పడొద్దని, సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని సర్దిచెప్పాలని చూసిన వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు రెండు వర్గాలపై కేసులు నమోదు చేశారు.


బహిరంగ ప్రదేశాల్లో మద్యం

రాత్రిపూట పలు కాలనీల్లో బహిరంగ ప్రదేశాల్లో, శివారు ప్రాంతాల్లో అల్లరిమూకలు వాలిపోతున్నారు. గ్రూపులుగా వచ్చి అర్ధరాత్రి వరకు మద్యం తాగుతున్నారు. దీంతో స్థానికులు, అటువైపు వచ్చివెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో మహిళలు రాత్రిపూట నడిచివెళ్లాలంటేనే భయపడే పరిస్థితులున్నాయి. పోలీసులు సైరన్‌లు మోగించినా, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా లెక్కచేయడం లేదు. 


లెక్కలు తీస్తున్న పోలీసులు

నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్‌ ఉన్నతాధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. రౌడీలు, అల్లరిమూకల ఆట కట్టించడానికి మూడు కమిషనరేట్ల సీపీలు కసరత్తు చేస్తున్నారు. ప్రతి కమిషనరేట్‌లో ఒక్కో పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ప్రస్తుతం ఎంతమంది రౌడీషీటర్లు ఉన్నారో లెక్కలు తీస్తున్నారు. వారు ఏఏ నేరాలకు పాల్పడ్డారు. వారిపై ఎన్ని కేసులున్నాయి, ఎన్నింటిలో శిక్షపడింది, ప్రస్తుతం ఎలాంటి నేరాలు చేస్తున్నారు ఇలా అనేక అంశాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల ఎంతమంది కొత్త రౌడీలు, గూండాలు ఉనికి చాటుకున్నారు, కొత్తగా ఎంతమందిపై రౌడీషీట్‌ తెరిచారు, వారి ప్రస్తుత పరిస్థితి ఏంటి..? ఇలా కొత్త జాబితాను సిద్ధం చేస్తున్నారు. వారిలో ఎంతమందితో స్థానికంగా ఇబ్బందులున్నాయి. రౌడీషీట్‌ తెరవాల్సిన అవసరం ఎంతమందిపై ఉంది అనే అంశాలపై ఎస్‌హెచ్‌వోలతో చర్చిస్తున్నారు. జోన్లవారీగా డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌వోలతో సమావేశం నిర్వహించి సెక్టార్‌ ఎస్‌ఐల ద్వారా గూండాలు, రౌడీలు, అల్లరిమూకలు, పోకిరీల సమాచారం సేకరించి అనుమానాస్పద వ్యక్తుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాత నేర తీవ్రతను బట్టి ఎంతమందిపై రౌడీషీట్‌ తెరవాలన్నది నిర్ణయించనున్నారు.


17 రోజుల్లో 7 హత్యలు

జనవరి-1- ఎల్‌బీనగర్‌లో గ్యాంగ్‌వార్‌లో యువకుడి హత్య

జనవరి-6 రాజేంద్రనగర్‌లో ఓ వృద్ధాశ్రమంలో వృద్ధుడి హత్య  

జనవరి-9 నార్సింగ్‌లో ఓ మహిళను బండరాయితో మోది హత్య 

జనవరి-11 సెల్‌ఫోన్‌ విషయంలో వివాదం చెలరేగి ఓ వ్యక్తిని బండరాయితో మోది హత్య

జనవరి-13 లాలాగూడలో రౌడీషీటర్‌ను(ఆటోడ్రైవర్‌) ప్రత్యర్థి వర్గాలు దారుణంగా హత్య చేశాయి. 

జనవరి-13  తుర్కయాంజల్‌లో వ్యక్తి తల లేకుండా పడి ఉన్న మొండెం కనిపించింది.

జనవరి-14 హుమాయున్‌నగర్‌లోని బోలానగర్‌లో ప్రత్యర్థి వర్గాలు 25 ఏళ్ల యువకుడిని హత్య చేశాయి.

Updated Date - 2022-01-18T16:51:26+05:30 IST