పిస్తోల్‌తో బెదిరింపులకు పాల్పడ్డ రౌడీ షీటర్‌

ABN , First Publish Date - 2022-01-18T05:00:49+05:30 IST

పిస్తోల్‌తో బెదిరింపులకు పాల్పడ్డ రౌడీషీటర్‌, మరో ఇద్దరిని సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏఎస్పీ అనోన్య తెలిపారు.

పిస్తోల్‌తో బెదిరింపులకు పాల్పడ్డ రౌడీ షీటర్‌
దేవునిపల్లి పోలీసు స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏఎస్పీ అనోన్య

- ఏఎస్పీ అనోన్య

కామారెడ్డి, జనవరి 17: పిస్తోల్‌తో బెదిరింపులకు పాల్పడ్డ రౌడీషీటర్‌, మరో ఇద్దరిని సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏఎస్పీ అనోన్య తెలిపారు. దేవునిపల్లి పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిస్తోల్‌తో పట్టుబడ్డ రౌడీషీటర్‌ సాజిద్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పొందుర్తి చౌరస్తాలో ఆదివారం రాత్రి టెక్రియాల్‌కు చెందిన సంతోష్‌, అతని మిత్రులు భోజనం చేసేందుకు షేరాహన్‌ దాబాకు వెళ్లగా దాబా సమీపంలో కారును నిలుపగా ఆ కారుపై చాట్ల జనార్ధన్‌ మూత్ర విసర్జన చేస్తూ కనిపించడంతో కారు కనిపించడం లేదా అని సంతోష్‌ ప్రశ్నించినందుకు తిట్టడంతో పాటు చాట్ల జనార్ధన్‌, అతని స్నేహితులైన సాజిద్‌, రవీందర్‌లు నీ అంతూ చూస్తామంటూ బెదిరించి ఇష్టం వచ్చినట్లు తిట్టి గొడవపడ్డారు. సాజిద్‌ అతని మిత్రుడు రవీందర్‌, జనార్ధన్‌లు కలిసి కామారెడ్డిలోని టెక్రియాల్‌కు చెందిన సంతోష్‌పై తుపాకి తీసి మా గురించి ఏమి అనుకుంటున్నావు అని తుపాకీ గురిపెట్టి చంపేస్తామంటూ రౌడీ షీటర్‌ సాజిద్‌ బెదిరించాడు. కాగా సంతోష్‌తో పాటు మరో ఇద్దరు మిత్రులు కలిసి దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. కామారెడ్డి రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఎస్‌ఐ జ్యోతి, సిబ్బంది కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు. పొందుర్తి చౌరస్తా వద్ద గల షేరాహన్‌ దాబా వద్ద సాజిద్‌తో పాటు చాట్ల జనార్ధన్‌, బోగి రవీందర్‌లను పట్టుకుని సాజిద్‌ వద్ద ఉన్న ఒక పిస్తోల్‌, 7 లైప్‌ రౌండ్స్‌ బుల్లెట్లు, ఒక మారుతి సుజికీ కారు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్‌ ఎస్పీ అనోన్య తెలిపారు. సాజీద్‌ అనే వ్యక్తి గతంలో కామారెడ్డి పోలీసు స్టేషన్‌ పరిధిలో పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. ఇతనిపై కామారెడ్డి పోలీసుస్టేషన్‌లో రౌడీషీట్‌ కూడా ఉందన్నారు. సెప్టెంబరు 2021లో సత్ప్రవర్తన గురించి ఇతనిని కామారెడ్డి తహసీల్దార్‌ వద్ద బైండోవర్‌ చేయడం జరిగిందని ఆయన కూడా ఇతని ప్రవర్తనలో మార్పు రాకుండా తిరిగి నేరాన్ని చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. బాధితుడు సంతోష్‌తో పాటు మరో ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో కామారెడ్డి రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు దేవునిపల్లి ఎస్‌ఐ జ్యోతి, పోలీసుసిబ్బందికి రివార్డ్‌ ఇవ్వాలని ఎస్పీకి నివేదించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కామారెడ్డి డీఎస్పీ సోమనాథం, దేవునిపల్లి ఎస్‌ఐలు ప్రసాద్‌, జ్యోతి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బాధితులు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు

కామారెడ్డి జిల్లాలో గన్‌కల్చర్‌ సంఘటన ఇదే మొదటిదని కామారెడ్డి ఏఎస్పీ అనోన్య తెలిపారు. కేవలం కారుపై మూత్రం పోసినందుకు ప్రశ్నించినందుకే తుపాకీ గురిపెట్టిన సంఘటన చూస్తుంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న రౌడీషీటర్‌ సాజిద్‌ ఇతరులకు తుపాకీ చూపి బెదిరింపులకు పాల్పడిన సంఘటనలు ఉండవచ్చన్నారు. బాధితులు ఎవరైన ఉంటే నిర్భయంగా దేవునిపల్లి పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రస్తుతం పట్టుబడ్డ గన్‌కు ఎలాంటి లైసెన్స్‌ లేదని ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్‌గా కొనుగోలు చేశాడా లేక ఎవరి వద్ద నుంచైనా తీసుకున్నాడా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు తెలిపారు. పట్టుబడ్డ రౌడీషీటర్‌ సాజిద్‌తో పాటు చాట్ల జనార్దన్‌, బోగి రవీందర్‌ల ద్వారా బెదిరింపులకు గురైన వారు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని అడిషనల్‌ ఎస్పీ తెలిపారు. ఫిర్యాదులు ఎక్కువగా వస్తే పీడీయాక్ట్‌ కూడా నమోదు చేస్తామని ఏఎస్పీ తెలిపారు.

Updated Date - 2022-01-18T05:00:49+05:30 IST