ఆర్సీబీకే కోహ్లీ, మ్యాక్స్‌వెల్.. రిటైన్‌కే మొగ్గు

ABN , First Publish Date - 2021-11-26T01:16:02+05:30 IST

వచ్చే ఏడాది ఐపీఎల్ ఆటగాళ్ల వేలం జరగనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రిటైన్

ఆర్సీబీకే కోహ్లీ, మ్యాక్స్‌వెల్.. రిటైన్‌కే మొగ్గు

బెంగళూరు: వచ్చే ఏడాది ఐపీఎల్ ఆటగాళ్ల వేలం జరగనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకోవాలని ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 8 జట్లు రిటైన్ ఆటగాళ్ల పేర్లను ఈ నెల 30 లోపు  వెల్లడించాల్సి ఉంటుంది. ప్రతి జట్టు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే వీలుంది. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండాలి.  

 

ఈసారి ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు  లక్నో, అహ్మదాబాద్ అరంగేట్రం చేయనున్నాయి. ప్రస్తుత జట్లు రిటెన్షన్ పూర్తయ్యాక వేలానికి ముందు ఈ జట్లు ముగ్గురేసి ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీరిలో ఇద్దరు భారతీయులు, ఒక విదేశీ ఆటగాడు ఉండాలి. 


రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఈసారి సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడం, సౌతాఫ్రికన్ స్టార్ ఏబీ డిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించడం ఆ జట్టుకు కొంత ఎదురుదెబ్బేనని చెబుతున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల రికార్డు కోహ్లీ పేరుపైనే ఉంది.


ఇకపై కెప్టెన్సీ బాధ్యతలు లేకపోవడంతో జట్టులో కీలక ఆటగాడిగా మారే అవకాశం ఉంది. ఐపీఎల్ 2021లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెలరేగి ఆడాడు. 513 పరుగులు సాధించాడు. అంతేకాదు, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటే మ్యాక్స్‌వెల్‌ను విలువైన ఆటగాడిగా పరిగణిస్తున్న ఆర్సీబీ అతడిని వదులుకోకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Updated Date - 2021-11-26T01:16:02+05:30 IST