రాజకుటుంబానికి ఆ హక్కుంది!

ABN , First Publish Date - 2020-07-14T06:41:55+05:30 IST

అనంత పద్మనాభ స్వామి ఆలయ(తిరువనంతపురం) నిర్వహణ హక్కుల కోసం తొమ్మిదేళ్లుగా పోరాడుతున్న ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది...

రాజకుటుంబానికి ఆ హక్కుంది!

  • పద్మనాభస్వామి ఆలయ నిర్వహణపై సుప్రీం తీర్పు
  • స్వాగతించిన ట్రావెన్‌కోర్‌ రాజవంశీయులు

న్యూఢిల్లీ, జూలై 13: అనంత పద్మనాభ స్వామి ఆలయ(తిరువనంతపురం) నిర్వహణ హక్కుల కోసం తొమ్మిదేళ్లుగా పోరాడుతున్న ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆలయ నిర్వహణకు సంబంధించి రాజకుటుంబానికి ఉన్న హక్కులను సుప్రీంకోర్టు సమర్థించింది. ఆలయ బాధ్యతలు చూడడానికి కొత్త కమిటీ ఏర్పాటయ్యేవరకూ తాత్కాలిక ఏర్పాటుగా తిరువనంతపురం జిల్లా న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ కొనసాగుతుందని జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మానసం స్పష్టం చేసింది.


చారిత్రక ఆధారాలు, సాంస్కృతిక విశ్వాసాలు, పద్మనాభ స్వామిఆలయంలో పూజలు, ఇతర కార్యక్రమాలు.. ఏ కోణంలో చూసినా వెయ్యేళ్లుగా ట్నావెన్‌కోర్‌ రాజ కుటుంబీకులే ఆలయ నిర్వాహకులుగా ఉం టున్నారని.. రాజకుటుంబంలో పుట్టిన మగపిల్లలు స్వామికి దాసులుగా, ఆడపిల్లలు సేవికలుగా ఉంటున్నారని గుర్తు చేసింది. సంస్థానాల విలీన సమయంలో అప్పటి ట్రావెన్‌కోర్‌ రాజు బలరామవర్మ భారత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆలయ బాధ్యతలు రాజకుటుంబం ఆధ్వర్యంలోని ట్రస్టుకే ఉండేవి. ట్రావెన్‌కోర్‌-కొచ్చిన్‌ హిందూ రెలీజియస్‌ ఇన్‌స్టిట్యూటషన్స్‌ యాక్ట్‌ ప్రకారం ఒక కార్యనిర్వహణాధికారి నేతృత్వంలోని అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ ద్వారా ఆలయ నిర్వహణ హక్కులు రాజకుటుంబానికే ఉంటాయి. రాజా బలరామవర్మ 1991లో చనిపోయారు. తర్వాత కూడా కేరళ సర్కారు ఆ బాధ్యతలను రాజకుటుంబానికే వదిలిపెట్టింది. అయితే, ఆలయ నిర్వహణ బాధ్యతలను రాజకుటుంబం నుంచి తొలగించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరుతూ 2009లో మాజీ ఐపీఎస్‌ అధికారి టీపీ సుందర్‌రాజన్‌ కేరళ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. కేరళ హైకోర్టు ఆలయ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలంటూ 2011 జనవరిలో తీర్పునిచ్చింది. రాజా మార్తాండవర్మ అదే ఏడాది మేలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఆలయ నేలమాళిగల్లోని సంపద లెక్కింపునకు పరిశీలకుల కమిటీని నియమించాల్సిందిగా సూచించింది. నేలమాళిగల్లోని 6గదుల్లో 5 గదులను తెరిచి సంపదను లెక్కించిన పరిశీలకులు దాని విలువను రూ.90 వేల కోట్లుగా తేల్చారు. నాగబంధం ఉన్న ‘బి’ గదిని మాత్రం తెరవలేదు. కాగా.. కోర్టు తీర్పుపట్ల ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబం హర్షం వ్యక్తం చేసింది. కేరళ సర్కారు కూడా తీర్పును స్వాగతించింది.


Updated Date - 2020-07-14T06:41:55+05:30 IST