Sep 11 2021 @ 13:48PM

Hero Sai Tej‌‌ కు జరిగిన ప్రమాదంపై మ్యూజిక్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..

హైదరాబాద్ సిటీ : మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై పలువురు టాలీవుడ్ పెద్దలు, సీనియర్, జూనియర్ హీరోలు స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు పెద్దలు నేరుగా అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ స్పందించారు.


ఆర్పీ ఏమన్నారు..!?

‘అతి వేగంగా వెళ్లిన సాయి తేజ్‌పై కేసు పెట్టిన పోలీసులు రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్‌స్ట్రక్షన్ కంపెనీపై కూడా కేసు పెట్టాలి. అంతేకాదు రోడ్లు సరిగ్గా శుభ్రం చేయని మున్సిపాలిటీ వారిపై కూడా చర్యలు తీసుకోవాలి’ అని ఆర్పీ పట్నాయక్ సంచలన కామెంట్స్ చేశారు. ఆర్పీ వ్యాఖ్యలపై ఇంతవరకూ పోలీసులు.. జీహెచ్ఎంసీ నుంచీ ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఒక వేళ స్పందిస్తే ఎలా ఉంటుందో అని నెటిజన్లు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.


కొందరు ఈ ఘటన జరగడానికి రోడ్డుపై ఇసుక ఉండటమే అంటుంటే.. అతి వేగమే కారణమని ఇంకొందరు అంటున్నారు. ఇండస్ట్రీలోని ఓ సీనియర్ నటుడి కుమారుడితో సాయితేజ్ బైక్ రేసింగ్ పెట్టుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరి మధ్య పోటీ పెట్టుకోవడంతో సాయితేజ్ అతివేగంగా వెళ్తూ ప్రమాదానికి గురయ్యారని సమాచారం. సీసీటీవీ ఫుటేజీలో కూడా రెండు ద్విచక్రవాహనాలు వేగంగా వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

కేసులు ఇవీ..

కాగా.. సాయితేజ్‌పై రాయదుర్గం పోలీసులు ఇప్పటికే ఐపీసీ 336, మోటర్ వెహికల్ యాక్ట్ 184 కింద రెండు కేసులు నమోదు చేశారు. ఇక ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన బైక్ రేసింగ్ వ్యవహారంపై మాదాపూర్ డీసీపీ దర్యాప్తు చేస్తున్నారు. అయితే బైక్ రేసింగ్ వ్యవహారంపై పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. విచారణ పూర్తి అయ్యాక పోలీసులు ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలోనే అత్యవసర విభాగంలో తేజ్ చికిత్స తీసుకుంటున్నాడు.

హైదరాబాద్మరిన్ని...