పెద్దఎల్కిచర్ల..మరో పిల్లలమర్రి

ABN , First Publish Date - 2020-02-22T11:28:06+05:30 IST

పెద్దఎల్కిచర్ల..మరో పిల్లలమర్రి

పెద్దఎల్కిచర్ల..మరో పిల్లలమర్రి

రెండెకరాల్లో అతిపెద్ద మర్రిచెట్టు

ఊడిపడుతున్న ఊడలు.. పట్టించుకోని పాలకులు 

స్వామి వైభవం అద్వితీయం ఫ కోరిన కోర్కెలు తీర్చే ఎల్లీరన్న స్వామి

తిఏటా అన్నదానం

కొమ్మ నరికితే కష్టాలు తప్పవు


చౌదరిగూడ : అది పెద్ద మర్రిచెట్టు.. చెట్టు కింద కొలువైన ఎల్లీరన్నస్వామి.. మహిమ అద్వితీయం... మర్రి చెట్టు నీడనే ఆయనకు గుడి.. గతంలో ఘనమైన చరిత్ర.. నేడు చెదలుపడుతున్న వృక్షం. అది ఎక్కడో కాదు. చౌదరి గూడ మండలం పెద్దఎల్కిచర్ల గ్రామ సమీపంలోని వందల సంవత్సరాల నుంచి ఉన్న రెండు ఎకరాల విస్తీర్ణంలో గల మర్రిచెట్టు. మరో పిల్లలమర్రిని పోలి ఉంటుంది.


గతమెంతో ఘనం

 వేరు ఎక్కడ ఉందో, ఏది చెట్టు మొదలో తెలియదు. ఊడలు పెద్దపెద్దగా ఉండి ప్రతి ఊడా చెట్టులా ఉంటుంది. చెట్టు కొమ్మ నరికిన వారికి కష్టాలు తప్పవు అని గ్రామస్థుల ప్రగాఢ నమ్మకం. కోరిన కోర్కెలు తీర్చే స్వామివారి మహిమలు అమోఘం అని గ్రామ పెద్దలు అంటుంటారు. చెట్టుచుట్టూ పొలాలు కలిగిన రైతులు పంట పండించిన అనంతరం కళ్ళాల్లోని గింజలు అక్కడే ఉంచి ఇంటికి వస్తారు. ఎవరైనా దొంగిలిస్తే స్వామివారే శిక్షిస్తారని అక్కడి రైతుల నమ్మకం. ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా గ్రామ హనుమాన్‌ దేవాలయంలో నెలకొల్పే వినాయకుడి నిమజ్జనం రోజు మర్రిచెట్టు ప్రాంగణంలో అన్నదానం కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తారు. అన్నదానం జరిపిన రోజు ప్రతి ఏటా వర్షం పడుతుందని గ్రామస్థుల ప్రగాఢ నమ్మకం.


గత చరిత్ర

వీరన్నపేటలో ఉన్న ఎల్లీరన్న అనే సత్యపురుషుడు గ్రామ శివారులో నేటికీ ఉన్న కోటలో అంగరంగా వైభవంగా ఇల్లు నిర్మించి ప్రారంభం చేస్తున్నప్పుడు ఆనాటి పాలకులు దాడి చేశారు. ఆ సమయంలో ఎల్లీరన్న వచ్చి ఈ మర్రి చెట్టుకిందనే తలదాచుకున్నట్లు పెద్దలు చెబుతున్నారు. ఆయనకు ఇద్దరు భార్యలు ఎల్లమ్మ, గాలమ్మలు ఉండేవారని వివరించారు. గాలమ్మ అనే ఆవిడ నేటి గాలిగూడకు వెళ్లిందని ఆమె పేరు మీదనే ఆ గ్రామం ఏర్పడిందని, అలాగే ఎల్లమ్మ ఎల్కిచర్లలోనే ఉండడంతో పెద్ద ఎల్కిచర్ల అని పేరు వచ్చిందని, ఎల్లిరన్న అనే వ్యక్తి చెట్టుకింద ఉండటంతో ఆ మర్రి చెట్టుకు ఎల్లీరన్నమర్రి అని పేరు వచ్చిందని, నేటికీ అలాగే పిలుచుకుంటామని అక్కడి గ్రామపెద్దలు తెలిపారు.   


ఊడిపడుతున్న ఊడలు.. పట్టించుకోని పాలకులు

ఇటు ఎల్లీరన్న స్వామికి.. అటు రెండు ఎకరాల విస్తీర్ణంలో గల మర్రిచెట్టుకు ఘనమైన చరిత్ర ఉన్నా పట్టించుకునే వారు లేరు. ఊడలు పెద్దగా ఉండి చెదలు పట్టి ఊడిపడుతున్నా పాలకులు ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిమాన్వితమైన ఎల్లీరన్న మర్రిని గ్రామపెద్దలు పట్టించుకుని అభివృద్ధి పరచాలని, కిందికి వస్తున్న నూతన ఊడలను కాపాడాలని కోరుతున్నారు. ప్రభుత్వం పట్టించుకుని ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పలువురు కోరుతున్నారు.

పెద్దఎల్కిచర్లను అభివృద్ధి చేస్తే రంగారెడ్డి జిల్లాలో మరో పిల్లలమర్రిని చూడవచ్చని, చెట్టు పక్కనే 600 ఎకరాల్లో అడవి ఉండటంతో పర్యాటక కేంద్రంగా మారుతుందని గ్రామస్థులు అంటున్నారు. గ్రామ పేరు ప్రఖ్యాతలు చరిత్రలో నిలిచి పోతాయని కోరుతున్నారు.


పర్యాటక కేంద్రంగా ప్రకటించాలి

ప్రభుత్వం పట్టించుకుని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలి. అభివృద్ధి చేసిన ట్లైతే మరో పిల్లల మర్రిగా తయారవుతుంది. ప్రభుత్వానికి భూమి ఇవ్వడాని కిరైతులు సానుకూలంగా ఉన్నా పట్టించుకునే అధికారులు లేరు. మహిమాన్విత మైన ఎల్లీరన్న మర్రిని ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి.

- భూపాల చారి, గ్రామ సర్పంచ్‌- పెద్దఎల్కిచర్ల

Updated Date - 2020-02-22T11:28:06+05:30 IST