హరి(ఈ)త వనం

ABN , First Publish Date - 2020-02-22T11:30:15+05:30 IST

హరి(ఈ)త వనం

హరి(ఈ)త వనం

అత్వెల్లిలో 10వేల ఈత మొక్కల పెంపకం

13 ఎకరాల్లో పెరుగుతున్న వనం

 రెండేళ్లలో నీరాకు రెడీన


మేడ్చల్‌ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఫలిస్తోంది. ఏటేటా నాటుతున్న మొక్కలు పెరిగి పెద్దవుతున్నాయి. వనంగా మారుతున్నాయి. హరితహారంలో అందరినీ భాగస్వామ్యం చేయడంతో పాటు నాటే మొక్కలను కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తున్నది. ముఖ్యంగా గౌడ కులస్థులకు కులవృత్తిని పెంపొందించడం...స్వచ్ఛమైన కల్లు అందించాలనే ఉద్దేశంతో గ్రామాల్లో చెరువు కట్టలు, ఖాళీ స్థలాల్లో ఈత మొక్కలు విరివిగా నాటాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ బాధ్యతను గౌడ సంఘం ప్రతినిధులకు, ఎక్సైజ్‌ శాఖ అధికారులకు అప్పగించింది. మేడ్చల్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు, అత్వెల్లి గౌడ సంఘం ప్రతినిధులు ప్రభుత్వం నిర్ధేశించన లక్ష్యాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచారు. మేడ్చల్‌ మునిసిపాలిటీ అత్వెల్లి పరిధిలో 2018-19లో నాటిన ఈ ఈత మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగాయి. 13 ఎకరాల్లో దాదాపు 10 వేల ఈత మొక్కలను నాడు నాటారు. మరో రెండళ్లల్లో కల్లును అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. చుట్టూ కనుచూపు మెరలో ఎటు చూసినా ఈత వనమే కనిపిస్తుంది. కొన్ని చిన్నవిగా మరికొన్ని మధ్య రకంగా మరికొన్ని పెద్దవిగా పెరిగాయి. హరితహారంలో భాగంగా అత్వెల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో పలుమార్లు ఇక్కడ ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టి ఈత మొక్కలను నాటారు. జిల్లా కలెక్టర్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.


వనాన్ని కాపాడుకున్న గౌడ కులస్థులు

హరితహారంలో భాగంగా నాటిన ఈత మొక్కలను రక్షించేందుకు గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బోర్లు వేయడంతో పాటు పైపులైను కూడా వేశారు. ప్రత్యేకంగా ఒకరిని పెట్టి ఈత మొక్కల రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. నగరానికి అతి దగ్గరగా ఉండటంతో నగరవాసులు సెలవు దినాల్లో కల్లు కోసం మేడ్చల్‌కు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈతవనం ఏపుగా పెరిగి కల్లు అందించడం ప్రారంభమైతే నీరా స్టాల్‌ ఏర్పాటు చేస్తామని గౌడ సంఘం ప్రతినిధులు తెలుపుతున్నారు. కల్లు కోసం వచ్చే వారి కోసం ఈ ఈతవనాన్ని గౌడసంఘం నాయకులు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈతవనం మధ్య మధ్యలో వివిధ రకాలు మొక్కలు పెంచుతూ చుట్టూ ఖర్జూర మొక్కలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. అత్వెల్లి శివారులో ఈతవనం ఏర్పాటు చేయడంతో ఈత మొక్కలను రక్షించేకునేందుకు కల్లుగీత కార్మికులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా అడవి పందుల నుంచి ఈత మొక్కలను రక్షించుకునేందుకు వారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీనికితోడు డ్రిప్‌ సిస్టమ్‌ లేకపోవడంతో ప్రతీ మొక్కను రక్షించేందుకు నీటిని పెట్టేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. మరో రెండళ్ల పాటు ఈ వనాన్ని రక్షించుకుంటే తమ కష్టాలు తీరుతాయని గౌడ సంఘం ప్రతినిధులు తెలుపుతున్నారు. ఇప్పటికే ఎంతో ఆహ్లాదకరంగా రూపొందుతున్న అత్వెల్లి ఈతవనానికి ప్రభుత్వం మరింత చేయూతనందిస్తే రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వారు తెలుపుతున్నారు. జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ గణేష్‌, మేడ్చల్‌ ఎక్సైజ్‌ సీఐ జగన్మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో ఈతవనం రూపొందుతున్నదని గౌడ సంఘం నాయకులు తెలిపారు.

Updated Date - 2020-02-22T11:30:15+05:30 IST