అనుమతులు ఇప్పిస్తాం

ABN , First Publish Date - 2020-02-22T11:11:20+05:30 IST

అనుమతులు ఇప్పిస్తాం

అనుమతులు ఇప్పిస్తాం

తాండూరు రూరల్‌ : తాండూరు మండలం నారాయణపూర్‌ సమీపంలోని కాగ్నా నదిపై రూ.9కోట్ల 20లక్షలతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం పనులను కేంద్ర నీతిఅయోగ్‌ అధికారుల బృందం పరిశీలించింది. గురువారం రాత్రి 10 గంటలకు నారాయణపూర్‌ గ్రామానికి వెళ్లి ముందుగా  బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించారు. బ్రిడ్జి పక్కన చెక్‌ డ్యాం నిర్మాణాన్ని కూడా పరిశీలించారు. అయితే  బ్రిడ్జి నుంచి తాండూరు రైల్వే గేటు వరకు బీటీ రోడ్డు పనులు పూర్తి కావాల్సి ఉంది. రైల్వే అధికారులు రైలు పట్టాల దగ్గర నుంచి రోడ్డు వేస్తున్నందున అనుమతులు ఇవ్వక ఆలస్యం జరిగిందని కాంట్రాక్టర్‌ నీతి అయోగ్‌ అధికారులకు వివరించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని, బీటీరోడ్డు పనులకు రైల్వే క్లియరెన్స్‌ రాగానే పూర్తి చేయడం జరుగుతుందని బృందానికి తెలియజేశారు. బ్రిడ్జి కం చెక్‌ డ్యాం నిర్మాణం పనులను క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వ నీతిఅయోగ్‌ అధికారులు గ్రామ సర్పంచ్‌ చంద్రప్ప, ఉపసర్పంచ్‌ గోరేమియా, స్థానికులు అమిద్‌, ఎల్మకన్నె పీఏసీఎస్‌ డైరెక్టర్‌ వడ్ల బిచ్చన్న, కేశవరెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి వల్ల ఎంతమేరకు ఉపయోగపడుతుంది,  దీంతో సమస్యలు తీరాయా? అనే విషయంపై ప్రశ్నించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని,  బ్రిడ్జ్జి సమీపం నుంచి పాత తాండూరు వరకు బీటీ రోడ్డు వేయాల్సి ఉందని, అయితే పీర్‌పకీర్‌సాబ్‌ దర్గా నుంచి రైల్వే గేటు వరకు రైల్వే అధికారులు రోడ్డు వేసేందుకు అనుమతులు నిరాకరించడంతో రోడ్డు నిర్మాణం పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ఉన్నతాధికారులకు వివరించారు. రైల్వే అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు అధికారులు స్పందిస్తూ త్వరలోనే రైల్వే శాఖ ఉన్నతాధికారులతో ఈ విషయంపై చర్చించి రోడ్డు పనులు పూర్తి చేసేలా చర్యలు చేపడతామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. రైల్వే అనుమతులు ఇవ్వకుంటే బ్రిడ్జీ నిర్మించి వృథా అవుతుందని గ్రామసు పేర్కొన్నారు.  గ్రామానికి కేంద్ర ప్రభుత్వం పీఎంవో ద్వారా అభివృద్ధి ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు తాము సహకరిస్తామని అధికారుల బృందం హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవరావు, పంచాయతీరాజ్‌ డిపార్ట్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ హన్మంత్‌రావు, ఈఈ మనోహర్‌రావు, తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడు, డీఈ వెంకట్‌రావు, ఏఈ రాజు, కాంట్రాక్టర్‌ ప్రతాప్‌రెడ్డి, గ్రామస్థులున్నారు.

Updated Date - 2020-02-22T11:11:20+05:30 IST