Abn logo
Sep 23 2021 @ 23:41PM

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వనే లేదు...

లక్ష్మీపురం ముంపు ప్రాంత ప్రజలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

కలెక్టర్‌ ముందు సమస్యలు ఏకరువు పెట్టిన కాకర్ల డ్యాం నిర్వాసితులు

కంభం (అర్ధవీడు), సెప్టెంబరు 23 : ఆర్‌ఆర్‌ ప్యాకేజీ లేదు.. నష్టపరిహారమూ లేదని పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన కాకర్ల డ్యామ్‌(గ్యాప్‌) ముంపు గ్రామాల ప్రజలు కలెక్టర్‌ ముందు ఆవదన వ్యక్తం చేశారు. గురువారం అర్ధవీడు మండలంలోని కాకర్ల డ్యామ్‌ పనులను, దాని పరిధిలో ముంపునకు గురవుతున్న లక్ష్మీపురం, కృష్ణానగర్‌ గ్రామాలను కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ సందర్శించారు. కలెక్టర్‌ గ్రామంలోకి రాగానే ముంపు వాసులంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము పడుతున్న కష్టాలను పూసగుచ్చినట్లు వివరించారు. డ్యామ్‌ పరిధిలో 270 నుంచి 300 ఎకరాల పంట భూములు, 200 గృహాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీతోపాటు నష్టపరిహారం అందజేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదని తెలిపారు. ఎంతో మంది కలెక్టర్లు వచ్చారు, చూశారు, హామీలు ఇచ్చారు గానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తమ పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం డబ్బు త్వరగా వచ్చేలా చూస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని తెగేసి చెప్పారు. పొలాల్లో పంటలు వేయకుండా బీళ్లుగా వదిలివేశామని, నష్టపరిహారం వచ్చే వరకు పంటలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ త్వరలో నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.


ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం అందిస్తాం

వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చట్టప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. నిర్వాసితుల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలను తరలించిన తరువాతే కృష్ణా జలాలు జిల్లాలోకి వస్తాయన్నారు. కాకర్ల కింద 12వేల ఎకరాలకు గాను ప్రస్తుతం 3 వేల ఎకరాలకు పరిహారం అందించామన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు మరో 600 ఎకరాల అసైన్‌మెంట్‌ భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2 వారాలకు ఒకసారి ప్రాజెక్టు ముంపు ప్రాంతాలలో భూసేకరణ ప్రత్యేక కలెక్టర్‌, ప్రత్యేక ఉప కలెక్టర్లు పర్యటిస్తారన్నారు. నిర్వాసితుల జాబితాను సచివాలయంలో ప్రకటిస్తామని, అభ్యంతరాల స్వీకరణ అనంతరం పరిహారం అందిస్తామని చెప్పారు. తవ్వకాలలో దెబ్బతిన్న విగ్రహాలకు పరిహారం ఇవ్వాలని గ్రామస్థులు కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ వెంట మార్కాపురం ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్‌ సరళా వందనం, ప్రత్యేక ఉపకలెక్టర్‌ గ్లోరియా, తహసీల్దార్‌ రవీంద్రరెడ్డి,  ఎంపీడీవో వీరభద్రాచారి పాల్గొన్నారు.