Sep 25 2021 @ 21:40PM

RRR: భీమ్ అకౌంట్‌లో మరో రికార్డ్!

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ మల్లీస్టారర్ ఫిల్మ్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రతీది సినిమాపై భారీగా అంచనాలను పెంచుతూనే ఉంది. ఇక భీమ్ పరిచయ టీజర్‌గా విడుదల చేసిన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. టాలీవుడ్ ఫస్ట్ 1 మిలియన్ లైక్స్ వీడియోగా ఆల్రెడీ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ టీజర్ ఇప్పుడు మరో మైలురాయిని అందుకుంది. 1.5 మిలియన్ లైక్స్‌తో టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఏ టీజర్ సాధించని ఘనతను సాధించి, ఇతర చిత్రాలకు సరికొత్త ఛాలెంజ్ మార్క్‌ను క్రియేట్ చేసింది. దీంతో భీమ్ కుమ్మేస్తున్నాడంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ టీజర్‌ను షేర్ చేస్తున్నారు. ఈ టీజర్‌కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే.