Mar 26 2020 @ 01:05AM

రౌద్రం... రణం... రుధిరం!

సాధారణంగా నిప్పు, నీరు కలవవు. ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది?


ఆవేశానికి ఆలోచన తోడైతే? ఈ ఊహే దర్శక ధీరుడు రాజమౌళికి వచ్చింది. నిప్పు కణికలా భారతీయులపై తెల్లదొరల పెత్తనాన్ని ఎదిరించిన ఆవేశపరుడు, భయం అన్నది లేకుండా తూటాలకు ఎదురొడ్డిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును, నీరులా నిశ్చలమైన ఆలోచనలతో తెల్లదొరలను ఎదిరించిన తెలంగాణ గొండు వీరుడు, యోధుడు కొమరం భీమ్‌ను కలిపారు. చరిత్రలో ఎప్పుడూ కలవని వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రూపొందిస్తున్నారు. కొమరం భీమ్‌గా చిన్న ఎన్టీఆర్‌, అల్లూరిగా రామ్‌చరణ్‌ నటిస్తోన్న ఈ సినిమా టైటిల్‌ లోగో, మోషన్‌ పోస్టర్‌ ఉగాది సందర్భంగా బుధవారం విడుదల చేశారు. తెలుగులో ‘ఆర్‌’ అంటే ‘రౌద్రం’! ‘ఆర్‌’ అంటే ‘రణం’! ‘ఆర్‌’ అంటే ‘రుధిరం’! మూడు ‘ఆర్‌’లను కలిపితే... ‘రౌద్రం రణం రుధిరం’ అన్నమాట.


అదే టైటిల్‌! కన్నడలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంటే ‘రౌద్ర రణ రుధిర’, హిందీలో ‘రైజ్‌ రోర్‌ రివోల్ట్‌’, తమిళంలో ‘రత్తం రణం రౌధిరం’, మలయాళంలో ‘రౌద్రం రణం రుధిరం’ అని తెలిపారు. ‘‘అగ్నిని నీరు ఆర్పివేస్తుంది! నీరుని అగ్ని ఆవిరిగా మారుస్తుంది! అపారమైన బలంతో ఈ రెండు శక్తులూ కలిసి వస్తున్నాయి’’ అని రాజమౌళి పేర్కొన్నారు. మోషన్‌ పోస్టర్‌లో మొదట నిప్పుకు చిహ్నం అన్నట్టు రామ్‌చరణ్‌ను, నీరుకి చిహ్నం అన్నట్టు ఎన్టీఆర్‌ను పరిచయం చేశారు. ‘‘వ్యతిరేక శక్తులైన నీరు, నిప్పు కలిస్తే... అపారమైన శక్తి మీ ముందుకు వస్తుంది’’ అని అజయ్‌ దేవగణ్‌ ట్వీట్‌ చేశారు.


వదంతులకు ఆలియా చెక్‌!

డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌, చరణ్‌ సరసన బాలీవుడ్‌ భామ ఆలియా భట్‌ నటిస్తున్నారు. ఇంకా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను ఆలియా భట్‌ ప్రారంభించలేదు. అయితే... డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక సినిమాలోంచి ఆమె తప్పుకున్నారని ప్రచారం జరిగింది. వాటన్నిటికీ ఒక్క ట్వీట్‌తో ఆలియా భట్‌ చెక్‌ పెట్టారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హిందీ మోషన్‌ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేశారు. వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమా విడుదల కానుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మోషన్‌ పోస్టర్‌పై చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.


చిరు... వర్మ ఏమన్నారంటే?

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మోషన్‌ పోస్టర్‌ చూశా! కనువిందుగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. కీరవాణి భావోద్రేకాలు కలిగించే నేపథ్య సంగీతం అందించారు. రాజమౌళి, తారక్‌, రామ్‌చరణ్‌ పనితీరు అద్భుతంగా ఉంది. ఉగాది రోజున ఎనర్జీ ఇచ్చారు’’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. ‘‘సార్‌... మీ ప్రశంసలు ఆనందాన్నిచ్చాయి. ట్విట్టర్‌కు స్వాగతం. మీకు ఉగాది శుభాకాంక్షలు’’ అని చిరంజీవికి ట్విట్టర్‌లో రాజమౌళి బదులిచ్చారు. ‘‘రాజమౌళీ... విరామం లేకుండా నిరుత్సాహపరిచే వార్తలు వస్తున్న సమయంలో జీవితంలో రాబోయే మంచి విషయాలు గుర్తుచేసినందుకు కృతజ్ఞతలు. జీవితంలో అంతా కోల్పోలేదు. కోవిడ్‌-19 భయంకరమైన విషయాలు, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి గొప్ప విషయాలు ఉన్నాయి’’ అని వర్మ ట్వీట్‌ చేశారు.


‘‘కనీసం స్టవ్‌ ఎలా వెలిగించాలో కూడా తెలియని వ్యక్తి నుండి తనకు తానే స్వయంగా, సంతోషంగా నలభీముడి (వంటగాడి)గా... అదీ ఒక్క రోజులో!’’ అని నాని సతీమణి అంజనా యలవర్తి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పేర్కొన్నారు. ఫొటో చూస్తే... ఆమె ఎవరి గురించి చెప్పారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా! అవును... సహజ నటుడు నాని వంట చేశారు. ఇంతకీ, ఆయన చేసిన వంటకం ఏంటో తెలుసా? చనా మసాలా! కిచెన్‌లో కుక్కర్‌ పట్టుకుని నాని గరిటె తిప్పుతున్నప్పుడు అంజనా ఫొటో తీశారు. పోస్ట్‌ చేశారు. అయితే... టేస్ట్‌ ఎలా ఉందో చెప్పలేదు. ఈసారి నానినీ కలిసినప్పుడు అడిగితే సరి! కరోనా కారణంగా ఇంట్లో ఉంటున్న తారలు ఈవిధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.


 చనా మసాలా వండాడోయ్‌!

ట్విట్టర్‌లోకి రామ్‌చరణ్‌ కూడా...

చిరంజీవి ఉగాది సందర్భంగా బుధవారం ఉదయం ట్విట్టర్‌లో, సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు. తల్లితో దిగిన ఫొటోని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. తనయుడు రామ్‌చరణ్‌ కూడా త్వరలో ట్విట్టర్‌లోకి వస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకో ఖాతా ఉంది. తన పుట్టినరోజైన మార్చి 27న ట్విట్టర్‌లోకి ఖాతా తెరవడానికి చరణ్‌ ముహూర్తం ఖరారు చేశారట.