రూ.లక్ష కోట్ల పన్ను వివాదాలు కొలిక్కి..

ABN , First Publish Date - 2021-01-04T05:57:27+05:30 IST

ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘వివాద్‌ సే విశ్వాస్‌’ (వీఎ్‌సవీ) పథకం అనుకున్న ఫలితాలు సాధిస్తోంది. కేంద్ర

రూ.లక్ష కోట్ల పన్ను వివాదాలు కొలిక్కి..

ఫలిస్తున్న వివాద్‌ సే విశ్వాస్‌ పథకం


న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘వివాద్‌ సే విశ్వాస్‌’ (వీఎ్‌సవీ) పథకం అనుకున్న ఫలితాలు సాధిస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ పథకం  కింద దాదాపు రూ.లక్ష కోట్ల పన్ను బకాయిలకు సంబంధించిన వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే చెప్పారు.


ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు గత ఏడాది డిసెంబరు నాటికి 96,000 మంది దరఖాస్తు చేశారు. వీరి నుంచి దాదాపు రూ.83,000 కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వివిధ కోర్టులు, ట్రైబ్యునల్స్‌లో రూ.9.32 లక్షల కోట్లకు సంబంధించి 4.8 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వివాద్‌ సే విశ్వాస్‌ పథకం ద్వారా కనీసం 20 శాతం కేసులు పరిష్కారమవుతాయని అధికార వర్గాల అంచనా.


జీఎ్‌సటీ ఎగవేతలపై ఉక్కుపాదం:

డేటా అనలిటిక్స్‌ సహా ఆదాయ పన్ను, జీఎ్‌సటీ, కస్టమ్స్‌ శాఖలు.. ఫైనాన్షియల్‌ ఇంటలిజెన్స్‌ యూనిట్స్‌ (ఎఫ్‌ఐయు) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా జీఎ్‌సటీ ఎగవేతదారులపై భారీ స్థాయిలో నిర్వహించిన దాడులు సత్ఫలితాలనిచ్చాయని పాండే చెప్పారు. ఎగవేతలకు పాల్పడ్డ ఏడు వేల కంపెనీలపై చర్యలు చేపట్టడంతో పాటు 187 మందిని అరెస్టు చేశారని, ఇది వసూళ్లు పెరగడానికి దోహదపడిందన్నారు.


ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు ఈ దాడుల ప్రభావంతో డిసెంబరులో జీఎ్‌సటీ వసూళ్లు చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1.15 లక్షల కోట్లుగా నమోదయ్యాయని పేర్కొన్నారు. గడచిన నెలన్నర కాలంలో నకిలీ ఇన్వాయిసింగ్‌ రాకెట్‌పై దాడులు నిర్వహించి 187 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా ఈ రాకెట్‌తో సంబంధమున్న ఉన్న కొన్ని కంపెనీల ఎండీలతో పాటు మొత్తం 40-50 మంది ప్రస్తుతం జైళ్లలో ఉన్నారని పాండే చెప్పారు. 


Updated Date - 2021-01-04T05:57:27+05:30 IST