ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూతో రూ.లక్ష కోట్లు

ABN , First Publish Date - 2021-03-28T06:19:58+05:30 IST

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22) లక్ష్యంగా నిర్ణయించిన రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ సాధ్యమేనని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ)

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూతో రూ.లక్ష కోట్లు

2021- 22 డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం సాధ్యమే: సీఈఏ సుబ్రమణియన్‌


న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22) లక్ష్యంగా నిర్ణయించిన రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ సాధ్యమేనని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్‌ ఈ విషయం స్పష్టం చేశారు. ఇందులో రూ.లక్ష కోట్లు ఒక్క ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారానే లభిస్తాయన్నారు. బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ ద్వారా మరో రూ.75,000 కోట్ల నుంచి రూ.80,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరతాయన్నారు. వీటికి తోడు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల కీలకేతర ఆస్తుల అమ్మకం ద్వారా మిగతా నిధులు  సమీకరించవచ్చని  ప్రభుత్వం భావిస్తోంది.  నాలుగు కీలక రంగాల్లో తప్ప, మిగతా ఏ రంగంలోనూ ప్రభుత్వ రంగ సంస్థల అవసరం లేదని మోదీ సర్కార్‌ భావిస్తున్న సంగతి తెలిసిందే.


ఆలస్యం : నిజానికి  ఎల్‌ఐసీ ఐపీఓ, బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ ఈ నెలాఖరుతో ముగిసే  ప్రస్తుత ఆర్థిక  సంవత్సరంలో(2020-21)నే పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు. దీంతో ఈ  కార్యక్రమం వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడింది. ఇటీవల ముగిసిన బడ్జెట్‌ సమావేశాల్లో ఎల్‌ఐసీ చట్ట సవరణకు పార్లమెంట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఎల్‌ఐసీ ఐపీఓకు ప్రధాన అడ్డంకి తొలగి పోయింది. బీపీసీఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న 52.98 శాతం వాటా కొనుగోలు చేసేందుకు వేదాంత గ్రూపుతో పాటు రెండు ప్రైవేట్‌ ఈక్విటీ(పీఈ) సంస్థలు ఆసక్తి వ్యక్తీకరించాయి. ఈ సంస్థల నుంచి ప్రభుత్వం త్వరలోనే ఫైనాన్సియల్‌ బిడ్స్‌ కోరనుంది. ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ కూడా మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


మరిన్ని బ్యాంకులు అవసరం: దేశంలో మరిన్ని బ్యాంకులు ఏర్పాటు కావలసిన అవసరాన్ని సుబ్రమణియన్‌ గుర్తు చేశారు. మన దేశంతో పోలిస్తే మూడో వంతు జనాభా మాత్రమే ఉన్న అమెరికాలో 25,000 నుంచి 30,000 బ్యాంకులు ఉన్నట్టు తెలిపారు. ఈ లెక్కన మన దేశ ప్రజల బ్యాంకింగ్‌ అవసరాలు తీర్చేందుకు మరిన్ని బ్యాంకుల అవసరం ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) చివరి వరకు రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6 శాతం మధ్య  కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని ఆర్‌బీఐ  చాలా వరకు  సాధించినట్టు తెలిపారు. 


వృద్ధికి ఢోకా లేదు: కొవిడ్‌తో నీరసించిన భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) రెండంకెల వృద్ధి రేటు సాధిస్తుందని సీఈఏ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సంవత్సరం ఇది 6.5-7 శాతానికి తగ్గినా, క్రమంగా ఇది 7.5-8 శాతం వద్ద స్థిరపడుతుందన్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఇందుకు దోహదం చేస్తాయన్నారు. 

Updated Date - 2021-03-28T06:19:58+05:30 IST