కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలివ్వాలి

ABN , First Publish Date - 2021-06-19T05:24:06+05:30 IST

కరోనా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఎమ్మెల్సీ దొరబాబు డిమాండ్‌ చేశారు.

కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలివ్వాలి
ఆర్డీవో కార్యాలయ ఏవోకు వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్సీ దొరబాబు

ఎమ్మెల్సీ దొరబాబు డిమాండ్‌


చిత్తూరు సిటీ, జూన్‌ 18: కరోనా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఎమ్మెల్సీ దొరబాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కరోనా ప్రభావంతో పేదలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ ప్రభుత్వం రూ.10 వేలు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు. అలాగే ఆక్సిజన్‌ అందక మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరోనా మృతుల దహన సంస్కారాలకు రూ.15 వేల సాయం అందించాలన్నారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో 65 లక్షల డోసుల టీకాలు ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 26 లక్షల డోసులే వినియోగించి మిగిలింది వృథా చేసిందని దొరబాబు ఆరోపించారు. ఇప్పటివరకు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు కూడా పూర్తిగా టీకా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా దెబ్బకు వ్యవసాయ రంగం కుదేలైందని, పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మోహన్‌ రాజ్‌, మాజీ జడ్పీటీసీలు రుద్రయ్య నాయుడు, చిట్టిబాబు నాయుడు, నేతలు దేవసుందరం, దొరబాబు చౌదరి, వినాయకం గౌండర్‌ తదితరులు పాల్గొన్నారు.     

Updated Date - 2021-06-19T05:24:06+05:30 IST