రూ. 100 కోసం కక్కుర్తి పడితే రూ. 1500 పోతాయి!

ABN , First Publish Date - 2020-05-22T10:03:19+05:30 IST

రాజు, దామోదర్‌ (పేర్లు మా ర్చాం) ఇద్దరూ బైక్‌పై వెళ్తున్నారు. రాజు బండి నడుపుతుండగా.. దామోదర్‌ వెనుక ..

రూ. 100 కోసం కక్కుర్తి పడితే  రూ. 1500 పోతాయి!

అతి తెలివి చూపిస్తే.. తడిసి మోపెడయ్యేలా చలానాలు


హైదరాబాద్‌ సిటీ, మే 21 (ఆంధ్రజ్యోతి): రాజు, దామోదర్‌ (పేర్లు మా ర్చాం) ఇద్దరూ బైక్‌పై వెళ్తున్నారు. రాజు బండి నడుపుతుండగా.. దామోదర్‌ వెనుక కూర్చున్నాడు. ఇద్దరికీ హెల్మెట్‌ లేదు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఓ సిగ్నల్‌ వద్ద ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ చేతిలో కెమెరాతో కనిపించాడు. అతడికి బండి నెంబర్‌ కనిపించకుండా ఉండేందుకు వెనుకకు వంగి.. నెంబర్‌ ప్లేట్‌ కనిపించకుండా చేతులు అడ్డం పెట్టాడు. వారి అతి తెలివి గమనించిన కానిస్టేబుల్‌, అతడి స్టంట్‌ను ఫొటో తీశాడు. తర్వాతి సిగ్నల్‌ వద్ద బండి నెంబర్‌ను సైతం ఫొటో తీశారు.


బైక్‌ రైడర్‌ హెల్మెట్‌ ధరించనందుకు రూ. 200, వెనుకాల కూర్చున్న వ్యక్తి (పిలియన్‌ రైడర్‌) హెల్మెట్‌ ధరించనందుకు రూ. 100, నెంబర్‌ ప్లేట్‌ కనిపించకుండా చేసినందుకు (ఇంప్రాపర్‌ నెంబర్‌ ప్లేట్‌) రూ. 200, నంబర్‌ ప్లేట్‌ కనిపించకుండా ఉండేందుకు చేసిన స్టంట్‌కు ప్రమాదకరంగా వాహనం నడిపాడంటూ రూ. 1000 చలానాలు విధించారు. అంటే.. హెల్మెట్‌ లేని ఒక్క తప్పును తప్పించుకునేందుకు యత్నించి.. మొత్తం రూ. 1500 చలానాను వారు కట్టాల్సి వచ్చింది. మరోసారి పట్టుబడితే బైక్‌ను సీజ్‌ చేస్తారన్న భయంతో.. మొత్తం చలానాను కట్టి ఉసూరుమంటూ ఇంటిబాట పట్టారు ఇద్దరూ. ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ తప్పించుకునేందుకు యత్నించేవారందరికీ ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 


తప్పు చేసి తప్పించుకోలేరు

నగరవాసులందరూ కచ్చితంగా ట్రాఫిక్‌ నిబంధనల్ని పాటించాల్సిందే. ప్రతి కమిషనరేట్‌ పరిధిలో లక్షలాది సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఈ-చలానాలు విధించే సిబ్బంది అన్ని ట్రాఫిక్‌ కూడళ్లను జల్లెడ పడుతుంటారు. నిబంధనలు పాటించక పోతే, వారి కళ్లనుంచి తప్పించకోవడం కష్టమనే విషయాన్ని వాహనదారులు గుర్తించాలి అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. 



Updated Date - 2020-05-22T10:03:19+05:30 IST