రూ.1,001 కోట్ల ఇల్లు!.. డీమార్ట్ అధిపతి సొంతం

ABN , First Publish Date - 2021-04-04T05:57:51+05:30 IST

దేశంలో అత్యంత ఖరీదైన గృహ కొనుగోలు ఒప్పందం కుదిరింది. దక్షిణ ముంబై, మలబార్‌ హిల్స్‌లోని ఓ ఇల్లు ఏకం గా రూ.

రూ.1,001 కోట్ల ఇల్లు!.. డీమార్ట్ అధిపతి సొంతం

దక్షిణ ముంబైలోని రెసిడెన్షియల్‌ ప్రాపర్టీని సొంతం చేసుకున్న డీ-మార్ట్‌ అధిపతి 


ముంబై: దేశంలో అత్యంత ఖరీదైన గృహ కొనుగోలు ఒప్పందం కుదిరింది. దక్షిణ ముంబై, మలబార్‌ హిల్స్‌లోని ఓ ఇల్లు ఏకం గా రూ.1,001 కోట్లకు అమ్ముడు పోయింది. గడిచిన కొన్నేళ్లలో ఇదే అతిపెద్ద రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ డీల్‌. ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌, డీ-మార్ట్‌ సూపర్‌ మార్కెట్ల అధిపతి రాధాకిషన్‌ దమానీ.. తన సోదరుడు గోపీ కిషన్‌ దమానీతో కలిసి దీన్ని కొనుగోలు చేశారు.


ఈ రెండంతస్తుల భవనం రిజిస్ట్రేషన్‌ మార్చి 31న జరిగింది. ఈ సందర్భంగా దమానీ సోదరులు రూ.30 కోట్ల స్టాంప్‌ డ్యూటీ చెల్లించినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల ప్రకారం.. ఈ ప్రాపర్టీ విస్తీర్ణం 5,752.22 చదరపు మీటర్లు లేదా 61,916 చదరపు అడుగులు. అంటే, దమానీలు చదరపు అడుగుకు రూ.1,61,670 చొప్పున చెల్లించారన్నమాట. 




  థానేలో 8 ఎకరాలు కొన్న దమానీ

రాధాకిషన్‌ దమానీకి ముంబైలోని ఆల్‌మౌంట్‌ రోడ్డులో ఇప్పటికే ఓ ప్రాపర్టీ ఉంది. ఈ కొత్త ఇంటిని సౌరభ్‌ మెహతా, వర్షా మెహతా, జయేష్‌ షా నుంచి కొనుగోలు చేశారు. ఈ మధ్యనే దమానీ థానేలోని 8 ఎకరాల భూమిని మాండలెజ్‌ ఇండియా (గతంలో క్యాడ్బరీ ఇండియా) నుంచి రూ.250 కోట్లకు కొనుగోలు చేశారు. గత ఏడాదికి ఫోర్బ్స్‌ ఇండియా విడుదల చేసిన ధనవంతుల జాబితాలో 1,540 కోట్ల డాలర్ల ఆస్తితో దమానీ దేశంలో నాలుగో స్థానంలో నిలిచారు. 


ముంబై.. ఖరీదైన ఒప్పందాల అడ్డా 

దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ఖరీదైన ప్రాపర్టీ కొనుగోలు ఒప్పందాలు కొత్తేం కాదు. కాకపోతే, నివాస గృహానికి వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించడం కాస్త అరుదైన విషయమే. సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ చైర్మన్‌ సైరస్‌ పూనావాలా 2015లో ముంబైలోని లింకన్‌ హౌజ్‌ను రూ.750 కోట్లకు కొనుగోలు చేశారు. 


Updated Date - 2021-04-04T05:57:51+05:30 IST