రూ.103.53కోట్లు

ABN , First Publish Date - 2022-01-19T05:00:17+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు వడ్లు అమ్మి మద్దతు ధర పొందాలని ప్రభుత్వం పేర్కొంది.

రూ.103.53కోట్లు
పరిగి మార్కెట్‌ కమిటీలోని నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రం

  • వికారాబాద్‌ జిల్లాలో ధాన్యం బకాయిలు
  • అమ్మిన వడ్ల డబ్బు కోసం రైతుల ఎదురుచూపులు  
  • ఇప్పటికే 99 కేంద్రాల మూసివేత! 
  • 28 కేంద్రాల్లో కొనసాగుతున్న ధాన్యం సేకరణ  
  • మరో వారంలో అవి కూడా బంద్‌..

   ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు వడ్లు అమ్మి మద్దతు ధర పొందాలని ప్రభుత్వం పేర్కొంది. రైతులు కాంట వేసిన వారం రోజుల్లో డబ్బులు వారి ఖాతాల్లో వేస్తామని చెప్పినా చాలా మంది రైతులకు ధాన్యం బకాయిలు వారాలకొద్దీ చెల్లించడం లేదు. వికారాబాద్‌ జిల్లాలో ఇంకా 12,548 మంది రైతులకు రూ.103.53 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో వడ్డీలకు అప్పు తెచ్చి వానకాలం పెట్టుబడిపెట్టిన రైతులకు మిత్తి రెట్టింపు అవుతోంది.

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన డబ్బు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ధాన్యం కాంట వేసిన 24గంటల్లోనే రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. ధాన్యం డబ్బు కోసం వారాలతరబడి రైతులు ఎదురు చూస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి 23,374 మంది రైతులకు రూ.211.57కోట్లు చెల్లించాల్సి ఉంది. ఐతే దీనిలో రూ.2,02.38కోట్ల చెల్లింపు వివరాలను ఆన్‌లైన్‌ చేశారు. 10,826మంది రైతుల ఖాతాల్లో రూ.108.04కోట్లు జమ చేశారు. ఇంకా 12,548మంది రైతులకు రూ.103.53కోట్లు చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్ల సమయం ముగింపునకు వచ్చినా తాము విక్రయించిన ధాన్యం డబ్బులు వేయడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులకు అమ్మినా ఇప్పటి వరకు డబ్బులు చేతికొచ్చేవని వారంటున్నారు. తాము మిత్తికి అప్పులు తెచ్చామని, వాటి వడ్డీ మీద పడుతోందని వాపోతున్నారు.


  • లక్ష్యంలో సగం వరకే సేకరణ

పౌర సరఫరాల శాఖ నిర్దేశించుకుకున్న లక్ష్యం మేరకు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చేయలేదు. సగమే సేకరించగలిగారు. ఇప్పటికే ధాన్యం రాక తగ్గిన నేపథ్యంలో వచ్చే వారం రోజుల్లో 10వేల టన్నులు సేకరించే అవకాశం ఉంది. వానకాలంలో 1,12,537.19ఎకరాల్లో రైతులు వరి వేశారు. సొంత అవసరాలు, విత్తన వినియోగానికి 32వేల టన్నులు పోగా, 2.5 లక్షల టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, మార్కెట్‌ కమిటీలు, ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలో 127 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 17వ తేదీ వరకు 23,374 మంది రైతుల నుంచి 1,07,944టన్నుల ధాన్యం సేకరించారు. ఐకేపీల ద్వారా 6,042 మంది రైతుల నుంచి 25,880టన్నులు కొన్నారు. పీఏసీఎ్‌సలు 7,569 రైతుల నుంచి 39,687.75టన్నులు, డీసీఎంఎస్‌ కేంద్రాల్లో 5,956 మంది రైతుల నుంచి 34,488.5 టన్నులు, ఎఫ్‌పీవో కేంద్రాల్లో 1,488 మంది రైతుల నుంచి 1,800 టన్నులు, మార్కెట్‌ కమిటీల్లో 2,319 మంది రైతుల నుంచి 6,088 టన్నులచొప్పున వడ్లు కొన్నారు. నవంబరు 15న ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మరో వారం పాటు కొనసాగనుంది. ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌సంబంధిత అధికారులతో ప్రతిరోజూ సమీక్షిస్తూ సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. వడ్లు రాక ఇప్పటికే 99వరకు కొనుగోలు కేంద్రాలు మూసేశారు. 28 కేంద్రాల్లో కొనసాగుతున్నాయి. వారంలో వాటినీ మూసి వేయనున్నారు. 


  • ఓటీపీ నిబంధనతో తగ్గిన కొనుగోళ్లు

జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఈసారి ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. వరి సాగు ఆధారంగా 2.5లక్షల టన్నుల వడ్లు కొనాలని భావించగా.. ఇప్పటి వరకు సగం కూడా సేకరించలేకపోయారు. ధాన్యం కొనుగోళ్లకు వన్‌ టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ) తప్పనిసరి చేయడంతో రైతు ఆధార్‌ కార్డుకు, వారి మొబైల్‌ నెంబర్‌కు అనుసంధానం లేక కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఓటీపీ వచ్చిన రైతుల నుంచే ధాన్యం కొనాలని నిబంధన విధించారు. దీంతో ఎక్కువ మంది రైతులు వడ్లను ప్రైవేట్‌ వ్యాపారులకే విక్రయించారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో లక్ష్యంలో సగం కూడా ధాన్యం సేకరణ చేయలేకపోయారు. అదీగాక ధాన్యం డబ్బు కూడా ఆలస్యంగా రావడమూ ఓ కారణంగా చెప్పవచ్చు.

Updated Date - 2022-01-19T05:00:17+05:30 IST