రూ. 2 కోట్ల అప్పు... రూ. లక్షలకు సెటిల్మెంట్... బ్యాంకు ఉదారత...

ABN , First Publish Date - 2021-03-05T01:56:42+05:30 IST

అప్పుంటే... ముక్కుపిండి నగదు వసూలు చేయడమే కాదు... బకచాంరేలే అప్పుడప్పుడు ఉదారత కూడా ప్రదర్శిస్తుంటాయి. ఇదీ అలాంటిదే. కాకపోతే... ఇది మామూలు ‘ఉదారత’ కాదండీ..! ఈ వివరాలు చదవండి మరి...

రూ. 2 కోట్ల అప్పు... రూ. లక్షలకు సెటిల్మెంట్... బ్యాంకు ఉదారత...

దుబాయ్ : అప్పుంటే... ముక్కుపిండి నగదు వసూలు చేయడమే కాదు... బకచాంరేలే అప్పుడప్పుడు ఉదారత కూడా ప్రదర్శిస్తుంటాయి. ఇదీ అలాంటిదే. కాకపోతే... ఇది మామూలు ‘ఉదారత’ కాదండీ..! ఈ వివరాలు చదవండి మరి... 


 దుబాయ్‌‌లో రుణం తీసుకున్న ఓ భారతీయుడు దానిని తిరిగి చెల్లించలేకపోయాడు. దాంతో ఆ అప్పు చాంతాడంతై కూర్చొంది. మరి ఎలా జరిగిందో కానీ... అతనిపై బ్యాంక్ అపారమైన ఉదారతను ప్రదర్శించింది. ఈ క్రమంలో... భారీ మొత్తాన్ని మాఫీ చేసింది. రూ. రెండు కోట్ల అప్పునకు...  కేవలం రూ. 5 లక్షలు కడితే చాలని చెప్పింది. ఖాతాదారుడు ఆపదలో ఉంటే బ్యాంకులు కూడా అర్థం చేసుకుంటాయని దుబాయికి చెందిన ఆర్థిక నిపుణుడు, కార్పొరేట్-కమర్షియల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గల్ఫ్ లా డైరెక్టర్ బార్నే అల్మజార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రవాస భారతీయుడి రూ. 2 కోట్ల రుణాన్ని బ్యాంకు మాఫీ చేయడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు. ఇక వివరాలు చూడండి...


2008లో దుబాయ్... వ్యాపారం...

ఆ భారతీయుడు 2008 లో దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడ ఓ చిన్న కంపెనీలో క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించాడు. అలా వచ్చే ఆదాయంలోనే కొంతమొత్తాన్ని కూడబెట్టి 2012 లో సొంతంగా ఓ వ్యాపారాన్ని ప్రారంభించాడు. అయితే... వ్యాపారంలో రాణించలేకపోయాడు. దీంతో అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. బ్యాంకు ఇచ్చిన క్రెడిట్ కార్డును కూడా వాడేశాడు. దాని బిల్లు కూడా కట్టకుండా తప్పించుకుంటూ వచ్చాడు. చివరకు పోలీసు కేసు కూడా నమోదు కావడంతో ఏం చేయాలో తెలియక ఏడేళ్ల క్రితం మళ్లీ భారత్‌కు తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత భారత్ లో కూడా పరిస్థితి అంతే ఉంది.  దాదాపు ఏడేళ్ళు ఎలాగోలా అష్టకష్టాలూ పడి, అలాగే బతుకుతూ వచ్చాడు. అటుపై మళ్ళీ దుబాయ్ వెళ్ళేందుకు సిద్ధమయ్యాడు.


కాగా...  యూఏఈలో అప్పులు చేసి వచ్చేయడంతో అక్కడి ప్రభుత్వం ఇతడిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఇదిలా ఉంటే... దుబాయ్ లో అతను తీసుకున్న క్రెడిట్ కార్డు తాలూకు రుణానికి సంబంధించి ఈ ఏడేళ్లలో వడ్డీ పది లక్షల దిర్హం(రూ. 2 కోట్లు)కు పైగా దాటింది. ఇదే సమయంలో దుబాయ్‌లోని ఆర్థిక నిపుణుడు అల్మజార్‌ను కలిసి గోడు వెళ్ళబోసుకున్నాడు. అల్మజార్‌కు అతడి నిజాయితీ, దుబాయికి వచ్చి మళ్లీ వ్యాపారం మొదలు పెట్టాలనుకునే కసి నచ్చి సహాయం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే భారీ సెటిల్మెంట్‌ జరిగింది. 


రూ.2 కోట్ల అప్పు... రూ.5 లక్షలకు సెటిల్మెంట్...

మొత్తంమీద సదరు బ్యాంకు సిబ్బంది భారతీయుడి కష్టాలను అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఏర్పడ్డ క్లిష్ట పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని... అతడి అప్పును పది లక్షల దిర్హామ్‌ల నుంచి 25 వేల దిర్హామ్‌(రూ. 4.92 లక్షలు)కు తగ్గించింది. దీంతో సదరు భారతీయుడు మళ్లీ దుబాయి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. దుబాయ్ బ్యాంక్ తనకు అవకాశాన్నిచ్చి, మరో జన్మనందించిందని సదరు భారతీయుడు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇదంతా... ఈ ఏడాది మార్చిలో జరిగింది. 

Updated Date - 2021-03-05T01:56:42+05:30 IST