పండగ కిక్కు

ABN , First Publish Date - 2021-10-17T08:19:40+05:30 IST

మద్యం ప్రియులా మజాకా! దసరా పండుగ రోజు ఒక్కరోజే రాష్ట్రంలో రూ.200 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు.

పండగ కిక్కు

  • ఒక్క రోజే రూ.200 కోట్ల మద్యం తాగేశారు!
  • గత ఏడాది దసరాతో పోలిస్తే భారీగా పెరుగుదల
  • కేవలం ఐదు రోజుల్లోనే రూ.685 కోట్ల అమ్మకం
  • గత ఏడాదితో పోలిస్తే రూ.280 కోట్లు ఎక్కువ
  • ఈనెలలో 12 రోజుల్లోనే 1430 కోట్ల విక్రయాలు
  • నెలాఖరుకు మరో రూ.1600 కోట్ల అమ్మకాలు?
  • రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖకు పెద్దఎత్తున ఆదాయం


 దసరా రోజు పెగ్గు పొంగింది. ‘కిక్కు’ అదిరింది. రాష్ట్రంలో ఆ ఒక్కరోజే మద్యం ప్రియులు రూ.200 కోట్ల మందు తాగి జబర్‌దస్త్‌ ‘పండుగ’ చేసుకున్నారు. దసరా ముందు నుంచే ఈ ఊపు మొదలైంది. సరుకు చాలకపోవడంతో బయట నుంచి తెప్పించారు. ఈ గ‘మ్మత్తు’తో సర్కారుకు పెద్ద ఎత్తున రాబడి వచ్చిపడింది.


హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మద్యం ప్రియులా మజాకా! దసరా పండుగ రోజు ఒక్కరోజే రాష్ట్రంలో రూ.200 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ దసరాకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. దసరా సందర్భంగా ఒక్కరోజే దాదాపు రూ.180 కోట్ల మద్యాన్ని దిగుమతి చేసుకోగా.. గతంలో ఉన్న స్టాక్‌తో కలిసి రూ.200 కోట్ల మద్యం అమ్ముడయిందని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ఇంతకుముందు కరోనా సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన రోజు రూ.130 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయని, ఆ తర్వాత ఈ దసరాకే భారీగా మద్యం అమ్ముడయుందని పేర్కొన్నారు. గత ఏడాది దసరాతో పోల్చితే ఈసారి లిక్కర్‌ విక్రయాల్లో 39 శాతం, బీర్లలో 57 శాతం వృద్ధిరేటు నమోదయిందని వివరించారు. పైగా ఈ సారి దసరా సందర్భంగా ఈ నెల 12 నుంచి 16 (శనివారం) వరకు ఐదు రోజుల్లోనే రూ.685 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగడం గమనార్హం. దీంతో ఎక్సైజ్‌ శాఖకు జోరుగా ఆదాయం వచ్చింది. గత ఏడాది దసరా సందర్భంగా ఈ అమ్మకాలు రూ.406 కోట్ల దాకా జరిగాయి. అప్పుడు కరోనా ప్రభావం కూడా కొంతమేరకు అమ్మకాలపై పడింది. 


ఈ దసరాకు మాత్రం ఐదు రోజుల్లోనే 7.90 లక్షల కేసుల లిక్కర్‌, 8.34 లక్షల కేసుల బీరు అమ్ముడయింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.58 కోట్లు, హైదరాబాద్‌లో రూ.42 కోట్ల మద్యం అమ్ముడయింది. కాగా, కరీంనగర్‌ జిల్లాల్లో మూడు రోజుల్లోనే రూ.29 కోట్లు, ఖమ్మంలో రూ.27 కోట్ల మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్‌ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో గత 12 రోజుల్లో 1,430 కోట్ల విలువైన 17.20 కోట్ల కేసుల లిక్కర్‌, 16.27 కోట్ల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. అత్యధికంగా హైదరాబాద్‌ రెండు డిపోల్లో కలిపి రూ.190 కోట్లు, హనుమకొండ రెండు డిపోల్లో రూ.155 కోట్లు, రంగారెడ్డి రెండు డిపోల్లో రూ.194 కోట్లు, నల్లగొండలో రూ.128 కోట్లు, మేడ్చల్‌లో రూ.103 కోట్లు, కరీంనగర్‌లో రూ.94 కోట్లు, ఖమ్మంలో రూ.90 కోట్లు, మహబూబ్‌నగర్‌లో రూ.72 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నెలలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో రూ.487 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక ఈ నెలాఖరు వరకు మరో రూ.1600 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతాయని ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తోంది. గత ఏడాది అక్టోబరులో రూ. 2,623 కోట్ల మద్యం విక్రయించినట్లు, ఈసారి అది రూ.3 వేల కోట్లకుపైగా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2021-10-17T08:19:40+05:30 IST