May 14 2021 @ 17:24PM

సినీ కార్మికులకు కరోనా సాయంగా రూ.2 వేలు

కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బకు చిత్రపరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. సినీ ఇండస్ట్రీనే నమ్ముకునివున్న అనేక మంది కార్మికులకు ఉపాధి లేకపోవడంతో పస్తులు వుండాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ  నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.పి.స్వామినాథన్‌తో తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు సమావేశమయ్యారు. స్థానిక సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో తమిళ సినీ నిర్మాతల సంఘం కార్యదర్శి రాధాకృష్ణన్‌, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌.కె.సెల్వమణి, తమిళనాడు చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్‌.వి.ఉదయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత ఆర్‌.కె.సెల్వమణి మీడియాతో మాట్లాడుతూ ‘‘లాక్డౌన్‌ కారణంగా అన్ని రకాల సినీ కార్యకలాపాలు ఆగిపోయాయి. అందువల్ల సినీ కార్మికులకు కరోనా సాయంగా రూ.2 వేలు ఇవ్వాలని విఙ్ఞప్తి చేశాం. అదేసమయంలో కరోనా నిబంధనలు, మార్గదర్శకాలకు లోబడి సినిమా, టీవీ షూటింగులు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరాం. తమ విన్నపాలను సావధానంగా ఆలకించిన మంత్రి స్వామినాథన్‌... ముఖ్యమంత్రి స్టాలిన్‌ దృష్టికి తీసుకెళ్ళి మంచి నిర్ణయం వెల్లడిస్తామని హామీ ఇచ్చారు’’ అని  వివరించారు.