రూ.210కే ఆక్స్‌ఫర్డ్‌ టీకా

ABN , First Publish Date - 2021-01-12T09:12:34+05:30 IST

భారత్‌ ఈనెల 16 నుంచి నిర్వహించనున్న ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా టీకా కార్యక్రమం దిశగా మరో అడుగు ముందుకుపడింది.

రూ.210కే ఆక్స్‌ఫర్డ్‌ టీకా

కోటి పది లక్షల డోస్‌లకు కేంద్రం ఆర్డర్‌

‘సీరం’తో కొనుగోలు ఒప్పందం 

లోడ్‌తో బయల్దేరిన ఆరు ఏసీ ట్రక్కులు

కన్సైన్మెంటు కేంద్రం నుంచి రాష్ట్రాలకు

త్వరలో భారత్‌ బయోటెక్‌తోనూ డీల్‌?

కోటి పది లక్షల డోసులకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్‌

మొదలైన డోసుల తరలింపు 


న్యూఢిల్లీ, జనవరి 11 : భారత్‌ ఈనెల 16 నుంచి నిర్వహించనున్న ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా టీకా కార్యక్రమం దిశగా మరో అడుగు ముందుకుపడింది. ఎట్టకేలకు ఆక్స్‌ఫర్డ్‌ (కొవిషీల్డ్‌) వ్యాక్సిన్‌ కోసం పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం ఆర్డరు ఇచ్చింది. రూ.210 చొప్పున 1.10 కోట్ల డోసుల కొనుగోలుకు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ఆరోగ్యశాఖ తరఫున కేరళలోని తిరువనంతపురం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ రంగ సంస్థ ‘హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌’ నుంచి ‘సీరమ్‌’కు ఆర్డరు అందింది.


భారత ప్రభుత్వానికి టీకాల ప్రొక్యూరింగ్‌ ఏజెన్సీగా హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌ వ్యవహరిస్తోంది. ఈ డీల్‌ వివరాలను ‘సీరం’ కంపెనీ చైర్మన్‌ సైరస్‌ పూనావాలా ధ్రువీకరించారు. ‘‘వచ్చే వారం మరో పెద్ద ఆర్డరు రావచ్చు’’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి వయో వృద్ధుల రక్షణ కోసం కరోనా టీకాలను ప్రైవేటు ఆస్పత్రులు, ఫార్మసీలకు సమకూర్చే వెసులుబాటును కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఒక డోసు ధర రూ.200 మాత్రమేనని, రూ.10 వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో కలుపుకొని అది రూ.210కి చేరుతోందని ఆ కంపెనీ అధికారవర్గాలు తెలిపాయి. పోలీసు భద్రత నడుమ.. పుణె శివారులోని మంజరి గ్రామంలో ఉన్న ‘సీరం’ ప్లాంట్‌ నుంచి సోమవారం సాయంత్రమే టీకాల తరలింపు ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించాయి. పుణెలోని కూల్‌-ఎజ్‌ కోల్డ్‌ చైన్‌ లిమిటెడ్‌ అనే కంపెనీకి చెందిన ఆరు ఎయిర్‌ కండిషన్డ్‌ ట్రక్కులు టీకాల లోడ్‌తో బయలుదేరాయని తెలిపాయి.  


 60 కన్‌సైన్‌మెంట్‌ పాయింట్లకు..

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన 60 వ్యాక్సిన్‌ కన్‌సైన్‌మెంట్‌ పాయింట్లకు డోసులు చేరుతాయని తెలుస్తోంది. ఆ కన్‌సైన్‌మెంట్‌ పాయింట్ల నుంచి రాష్ట్రాల్లో ఏర్పాటుచేసిన ప్రధాన స్టోరేజీలకు, అక్కడి నుంచి జిల్లాల్లోని నిల్వ కేంద్రాలకు టీకాలను తరలిస్తారు. ఈక్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఉన్న సెంట్రల్‌ వ్యాక్సిన్‌ స్టోరేజీకి దాదాపు 2,54,500 డోసులు చేరనున్నాయి. ఇక హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీతోనూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే టీకాల కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకోనుందంటూ ఓ ఆంగ్ల టీవీ చానల్‌ కథనాన్ని ప్రసారం చేసింది. 


మొబైల్‌ నంబర్‌ ఆధార్‌తో లింకై ఉంటేనే..

కరోనా టీకా సురక్షితమైంది, ప్రభావశీలమైందని ప్రపంచానికి చాటి చెప్పేందుకుగానూ సంస్థలోని 3.5 లక్షల మంది సభ్యులంతా స్వచ్ఛందంగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) విజ్ఞప్తి చేసింది. ఇక కరోనా టీకా వేయించుకునే వారి మొబైల్‌ నంబర్లు ‘ఆధార్‌’తో అనుసంధానమై ఉండటం తప్పనిసరి అని కొవిడ్‌-19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘సాంకేతిక పరిజ్ఞానం, సమాచార నిర్వహణ సాధికార బృందం’ చైర్మన్‌ రాంసేవక్‌ శర్మ వెల్లడించారు. ఒకరి బదులు మరొకరు టీకా వేయించుకోకుండా నిలువరించడానికే ఈ జాగ్రత్త చర్యను పాటిస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు.




కాగా, దేశంలో మరో ఆరుగురికి కరోనా కొత్త స్ట్రెయిన్‌ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు స్ట్రెయిన్‌ బారినపడినవారి సంఖ్య 96కు చేరింది. ఆదివారం దేశంలో కరోనాతో 161 మంది మృతి చెందారు. 229 రోజుల తర్వాత ఇవే అత్యల్పం. కొత్తగా 16,311 కేసులు నమోదయ్యాయి. 16,959 మంది కోలుకున్నారు.  కొత్త కేసుల్లో 28 శాతం కేరళ (4,545)లో, 21.81 శాతం మహారాష్ట్ర (3,558)లోనే నమోదయ్యాయి. 

Updated Date - 2021-01-12T09:12:34+05:30 IST