Abn logo
Sep 24 2021 @ 23:31PM

కోనాపూర్‌ సొసైటీలో రూ.2.26 కోట్లు స్వాహా!

కోనాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

సొసైటీలో అక్రమాలు జరిగాయని గతేడాది పలువురు డైరెక్టర్ల ఫిర్యాదు

అవకతవకలపై విచారణ జరిపిన సహకారశాఖ

సొసైటీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, సీఈవో గోపాల్‌రెడ్డి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేల్చిన అధికారులుఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, సెప్టెంబరు 24: మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్‌ ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన అవకతవకలపై సహకారశాఖ అధికారులు నిగ్గుతేల్చారు. సొసైటీ చైర్మన్‌, మెదక్‌ ఎమ్మెల్యే పద్మారెడ్డి భర్త ఎం.దేవేందర్‌రెడ్డి, సీఈవో గోపాల్‌రెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు నివేదక ఇచ్చారు. మొత్తంగా రూ.2.26కోట్ల దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. 

సొసైటీకి సంబంధించిన ఎరువుల దుకాణం, పెట్రోల్‌ఖర్చులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం, వేతనాలు, రుణాల చెల్లింపులు, తదితర వాటిల్లో అక్రమాలు జరిగాయని పలువురు డైరెక్టర్లు గతేడాది సెప్టెంబరు7న సహకారశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అప్పటి జిల్లా సహకారశాఖ సీఈవో గోపాల్‌రెడ్డికి మెమో జారీ చేశారు. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సహకార చట్టం 1964 సెక్షన్‌ 51 ప్రకారం సమగ్ర దర్యాప్తునకు డీసీవో ఆదేశించారు. ఈ మేరకు ఆయన 2015 నుంచి 2020 వరకు సొసైటీ జరిపిన లావాదేవీలపై విచారణ జరిపి జిల్లా సహకారశాఖ అధికారికి నివేదికను అందజేశారు. నివేదికలో ఎరువుల విక్రయాలకు సంబంధించి రూ.75 లక్షలు, పెట్రోల్‌బంక్‌కు సంబంధించిన వ్యవహారంలో సుమారు రూ.70లక్షలు, అనుమతులు లేకుండా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.22లక్షలు, బోగస్‌ చెల్లింపులకు సంబంధించి రూ.10 లక్షలు, క్రిబ్‌ కో షేర్ల ఉపసంహరణకు సంబంధించి రూ.5లక్షలు, రుణాలకు సంబంధించి రూ.14లక్షలు దుర్వినియోగానికి పాల్పడినట్లు తేల్చారు. మొత్తంగా రూ.2.26 కోట్లు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఏడాదిగా 21శాతం వడ్డీతో సంబంధిత వ్యక్తుల నుంచి రికవరీ చేయాలని డీసీవో కరుణ నివేదికలో పేర్కొన్నారు. అయితే క్రిబ్‌ కో షేర్ల ఉపసంహరణకు సంబంధించిన రూ.5.10లక్షలు, విద్యుత్‌శాఖకు జరిమానాల పేరిట రూ.97,710, బోగస్‌ చెల్లింపులకు సంబంధించి రూ.4.25లక్షలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించిన మేస్ర్తీలకు చెల్లించిన రూ.50వేలలో సీఈవో గోపాల్‌రెడ్డితో పాటు సొసైటీ చైర్మన్‌ కూడా అక్రమాలకు పాల్పడినట్లు డీసీవో నివేదికలో వివరించారు. 

అధికారులు విచారణకు సంబంధించిన నివేదికను గతనెల 17న సభ్యులకు అందజేశారు. శుక్రవారం జరిగిన కోనాపూర్‌ ప్రాథమిక సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో విచారణ నివేదికను సభ్యులు చదివి వినిపించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, దుర్వినియోగం అయిన నిధులను రికవరీ చేయాలని ఏకగ్రీవంగా వారు తీర్మానం చేశారు. అయితే నిధుల దుర్వినియోగం విషయమై వివరాలు తెలుసుకు నేందుకు సొసైటీ చైర్మన్‌ను ఫోన్‌లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.!

కోనాపూర్‌ ప్రాథమిక సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సభ్యులు