75 రోజుల్లో రూ.26 వేల కోట్లు!

ABN , First Publish Date - 2022-06-15T07:52:56+05:30 IST

75 రోజుల్లో రూ.26 వేల కోట్లు!

75 రోజుల్లో రూ.26 వేల కోట్లు!

అప్పుల్లో జగన్‌ సర్కారు కొత్త రికార్డు.. 

తాజాగా రూ.2 వేల కోట్లు.. భారీ వడ్డీ

28,000 కోట్ల పరిమితిలో సగం వాడకం

అమరావతి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ‘నాకు నేనే సాటి. నాకు లేదు పోటీ’ అంటూ జగన్‌ సర్కారు అప్పుల్లో ముందుకు దూసుకెళుతోంది. ప్రతి మంగళవారం కొత్త రికార్డు  నమోదు చేస్తోంది. కేవలం రెండున్నర నెలల్లో... అంటే 75 రోజుల్లో జగన్‌ సర్కారు రూ.26,190 కోట్లు కొత్త అప్పు తెచ్చింది. మంగళవారం బాండ్ల వేలంలో రూ.2,000 కోట్లు అప్పు తెచ్చింది. దీనిపై వడ్డీ 8 శాతానికి పైగా అమలైంది. రూ.1,000 కోట్ల అప్పుపై 8.07 శాతం, మరో రూ.1000 కోట్లపై 8.03 శాతం వడ్డీ పడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఆర్‌బీఐ ద్వారా రాష్ట్రం తెచ్చిన అప్పుల్లో ఇదే అధిక శాతం వడ్డీ. ఆర్‌బీఐ నుంచి కాకుండా లిక్కర్‌ బాండ్ల అమ్మకం ద్వారా జగన్‌ ప్రభుత్వం తెచ్చిన రూ.8,300 కోట్ల అప్పుపై రికార్డు స్థాయిలో 9.62 శాతం వడ్డీ అమలైంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యాక ఏప్రిల్‌లో రూ.4,390 కోట్లు, మే నెలలో రూ.9,500 కోట్లు అప్పు తెచ్చారు. జూన్‌లో 4,000 కోట్లు అప్పు తెచ్చారు. దీంతో మొత్తం 75 రోజుల్లో చేసిన అప్పు రూ.26,190 కోట్లకు చేరింది. కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీకి రూ.28,000 కోట్ల అప్పునకు మాత్రమే అనుమతిచ్చింది. జగన్‌ సర్కార్‌ ఏప్రిల్‌లో తెచ్చిన రూ.4,390 కోట్ల అప్పు గత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన అప్పుల పరిమితి నుంచి తెచ్చారు. ఈ ఏడాదికి ఇచ్చిన అప్పుల పరిమితిని మే నెల నుంచి వాడటం మొదలుపెట్టారు. ఇప్పటికి రూ.13,500 కోట్లు వాడేశారు. అంటే... ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా రూ.14,500 కోట్ల పరిమితి మాత్రమే మిగిలి ఉంది. నిజానికి... లిక్కర్‌ బాండ్ల ద్వారా తెచ్చిన రూ.8,300 కోట్ల అప్పును కూడా కేంద్రం ఇచ్చిన రూ.28,000 కోట్ల పరిమితిలోనే చూపాలి. కానీ, రాష్ట్రం ఈ నిబంధనను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా కార్పొరేషన్ల పేరుతో దొంగ అప్పులు చేస్తూనే ఉంది.

Updated Date - 2022-06-15T07:52:56+05:30 IST