బ్యాడ్‌ బ్యాంక్‌కు రూ.30,600 కోట్లు

ABN , First Publish Date - 2021-09-17T07:53:30+05:30 IST

బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు ప్రక్రియ మరో అడుగు ముందుకు పడింది. జాతీయ ఆస్తి పునర్నిర్మాణ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) పేరుతో ప్రభుత్వం ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తోంది.

బ్యాడ్‌ బ్యాంక్‌కు రూ.30,600 కోట్లు

న్యూఢిల్లీ: బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు ప్రక్రియ మరో అడుగు ముందుకు పడింది. జాతీయ ఆస్తి పునర్నిర్మాణ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) పేరుతో ప్రభుత్వం ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ బ్యాంక్‌కు ఐదేళ్ల పాటు రూ.30,600 కోట్ల పూచీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయం చెప్పారు. ఈ హామీ నిధులతో బ్యాంకుల నుంచి తీసుకునే ఆమోదిత మొండి బకాయి (ఎన్‌పీఏ)ల్లో 15 శాతాన్ని నగదు రూపంలో బ్యాడ్‌ బ్యాంక్‌ చెల్లిస్తుంది. మిగతా 85 శాతం మొత్తానికి హామీ పూర్వక రుణ పత్రాలు జారీ చేస్తుంది. తర్వాత ఈ ఎన్‌పీఏలను వేలంలో అమ్మడం ద్వారా రాబట్టుకుంటుంది. 


బ్యాంకులకు ఊరట: బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు పెద్ద ఉపశమనం కానుంది. గుదిబండలా మారిన వీటి ఎన్‌పీఏలు ఇక బ్యాడ్‌ బ్యాంక్‌కు బదిలీ అవుతాయి. ఇందుకోసం రూ.500 కోట్ల కంటే ఎక్కువ ఉన్న దాదాపు రూ.2 లక్షల కోట్ల ఎన్‌పీఏలను ఇప్పటికే గుర్తించారు. ఇందులో తొలి ధశలో రూ.90,000 కోట్ల ఎన్‌పీఏలు బ్యాడ్‌ బ్యాంక్‌కు బదిలీ కానున్నాయి. 

Updated Date - 2021-09-17T07:53:30+05:30 IST