రూ.31.55 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2022-04-04T08:06:21+05:30 IST

మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరం భారత ఎగుమతిదారులకు బాగా కలిసొచ్చింది.

రూ.31.55 లక్షల కోట్లు

2021-22లో రికార్డు స్థాయిలో భారత ఎగుమతులు 


న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరం భారత ఎగుమతిదారులకు బాగా కలిసొచ్చింది. ఈ కాలంలో మన దేశం నుంచి ఎగుమతులు రికార్డు స్థాయిలో 41,800 కోట్ల డాలర్లకు (సుమారు రూ.31.55 లక్షల కోట్లు) చేరాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన 40,000 కోట్ల డాలర్ల కంటే ఇది 1,800 కోట్ల డాలర్లు ఎక్కువ. కంపెనీలు, పారిశ్రామిక సంఘాలు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఎగుమతులను టాప్‌గేర్‌లో ఉంచాయి. పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్‌ వస్తువులు, జెమ్స్‌ అండ్‌ జువెలరీ, రసాయనాలు, ఫార్మా ఎగుమతులు భారీగా పెరగడం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల జోరుకు బాగా కలిసొచ్చింది. అమెరికా, యూఏఈ, చైనా, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్‌.. భారత్‌ నుంచి వస్తువుల దిగుమతి చేసుకోవడంలో టాప్‌-5 జాబితాలో ఉన్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రయాణంలో ఇదో కీలక మలుపని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. కాగా ఇదే కాలంలో భారత దిగుమతులు కూడా రికార్డు స్థాయిలో 61,000 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.

ఆగని జోరు: కాగా మార్చిలోనూ ఎగుమతుల జోరు కొనసాగింది. ఈ కాలంలో ఎగుమతులు గతంలో ఎన్నడూ లేని విధంగా 4,038 కోట్ల డాలర్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 512 కోట్ల డాలర్లు ఎక్కువ. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు ప్రతి నెలా సగటున 3,000 కోట్ల డాలర్ల చొప్పున ఎగుమతులు జరిగినట్టు గోయల్‌ తెలిపారు. 


Updated Date - 2022-04-04T08:06:21+05:30 IST