రోడ్ల నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు

ABN , First Publish Date - 2021-06-23T05:43:36+05:30 IST

పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో పలు రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తెలిపారు.

రోడ్ల నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు
పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీరింగ్‌ చీఫ్‌ను కలిసిన ఎమ్మెల్యే బాబూరావు

ఎమ్మెల్యే బాబూరావు వెల్లడి


నక్కపల్లి, జూన్‌ 22: పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో పలు రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తెలిపారు. మంగళవారం ఆయన అమరావతిలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీరింగ్‌ చీఫ్‌ సుబ్బారెడ్డిని కలిసి రహదారులకు నిధులు మంజూరు, టెండర్ల ప్రక్రియ తదితర అంశాలపై మాట్లాడారు. అనంతరం ఆయన నక్కపల్లి విలేకర్లకు ఫోన్‌ చేసి, ఆయా వివరాలను వెల్లడించారు. నిధులు మంజూరు అయినందున నక్కపల్లి మండలం మనబాలవానిపాలెం గ్రామం నుంచి హైవే జంక్షన్‌ వరకు త్వరలో రహదారి నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు. నక్కపల్లి మండలం చినతీనార్ల ఎగుదలపేట, అయ్యన్నపాలెం, కొర్రవానిపాలెం గ్రామాలకు రహదారులను నిర్మిస్తామని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని ఇంజనీరింగ్‌ చీఫ్‌ హామీ ఇచ్చారని చెప్పారు. ఆయన వెంట వైసీపీ నాయకులు వీసం రామకృష్ణ, లొడగల చంద్రరావు, కొప్పిశెట్టి హరిబాబు, గంటా తిరుపతిరావు, తళ్లా భార్గవ్‌ వున్నారు.


టీటీడీ చైర్మన్‌తో ఎమ్మెల్యే భేటీ

ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చెప్పారు. మంగళవారం ఆయన అమరావతిలో టీటీడీ చైర్మన్‌ని కలిశారు. కొండపైకి వెళ్లే మెట్ల మార్గం పునర్నిర్మాణం, శ్రీవారి పోటు గది నిర్మాణం, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకుల సమస్యలను టీటీడీ చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లానని ఎమ్మెల్యే చెప్పారు. తదుపరి జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో ఉపమాక క్షేత్రానికి సముచిత రీతిన నిధులు మంజూరు చేయాలని కోరానన్నారు. 


Updated Date - 2021-06-23T05:43:36+05:30 IST