బ్రహ్మంసాగర్‌ లీకేజీలకు మోక్షం

ABN , First Publish Date - 2021-06-19T05:38:23+05:30 IST

జిల్లాలో ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా 17 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో బ్రహ్మంసాగర్‌ జలాశయం నిర్మించారు. దీని కుడి, ఎడమ ప్రధాన కాలువల కింద బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో 1.56 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి.

బ్రహ్మంసాగర్‌ లీకేజీలకు మోక్షం
బ్రహ్మంసాగర్‌ జలాశయం

మరమ్మతులకు రూ.46.68 కోట్లు మంజూరు

టెండర్లు ఆహ్వానించిన ఇరిగేషన ఇంజనీర్లు

23న ప్రైజ్‌బిడ్‌ ఓపన.. అదే రోజు రివర్స్‌ టెండరింగ్‌

మూడు నెలల్లో పనులు చేసేలా ప్రణాళిక 

అసంపూర్తి కాలువల మాటేంటి..?

రూ.46 కోట్లకు ప్రతిపాదన.. స్పందించని ప్రభుత్వం


బ్రహ్మంసాగర్‌ జలాశయం లీకేజీల మరమ్మతులకు మోక్షం లభించనుంది. ప్రభుత్వం రూ.46.68 కోట్లు విడుదల చేసింది. మూడు నెలల్లోగా మరమ్మతులు పూర్తి చేసేలా తెలుగుంగ ప్రాజెక్టు ఇంజనీర్లు టెండర్లు ఆహ్వానించారు. టెండర్‌ షెడ్యూల్‌ దాఖలుకు ఈ నెల 22న ఆఖరు. 23న ప్రైజ్‌ బిడ్‌ ఓపన చేసి.. అర్హత సాధించిన కాంట్రాక్టర్లతో అదే రోజు రివర్స్‌ టెండరింగ్‌ పూర్తి చేస్తారు. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఏడాది పూర్తి సామర్థ్యం 17 టీఎంసీలు నిల్వచేసే అవకాశం ఉంది. అయితే.. అసంపూర్తి కాలువల పనులకు నిధులు మంజూరు చేయలేదు. కాలువలే పూర్తి కానప్పుడు జలాశయం పూర్తిస్థాయిలో నింపినా ప్రయోజనం ఏమిటి..? అని సాగునీటి నిపుణులు ప్రశ్నిస్తున్నారు.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా 17 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో బ్రహ్మంసాగర్‌ జలాశయం నిర్మించారు. దీని కుడి, ఎడమ ప్రధాన కాలువల కింద బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో 1.56 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. నిర్మాణం పూర్తి చేసి ప్రాజెక్టును 2006లో అన్నదాతకు అంకితం ఇచ్చినా.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం, నిధుల కొరత వెరసి కరువు రైతుల కన్నీళ్లు తుడవలేని దైన్యపరిస్థితి. కారణం.. జలాశయం లీకేజీలు, ప్రధాన, పంట కాలువలు అసంపూర్తిగా ఆగిపోవడమే. ఈ ప్రాజెక్టు దుస్థితిపై ఆంధ్రజ్యోతి పలు కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చింది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రిజర్వాయర్‌ లీకేజీ మరమ్మతులకు రూ.46.68 కోట్లు మంజూరు చేసింది. రైతులకు ఊరట కల్గించే అంశమే. అలాగే అసంపూర్తి కాలువలను సైతం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కూడా మంజూరు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఆ కాలువలు పూర్తయితేనే కృష్ణా జలాలతో కరువు నేల పచ్చని పైర్లతో సస్యశ్యామలం అయ్యేది. లేదంటే కళ్ల ముందే నీళ్లున్నా.. నిష్ప్రయోజనమే అవుతుందని రాయలసీమ సాగునీటి నిపుణులు అంటున్నారు.


మూడు నెలల్లో లీకేజీ మరమ్మతులు

బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టులో 2007లో తొలిసారిగా 208 మీటర్ల లెవల్‌లో 13 టీఎంసీలు నింపితే.. ఆనకట్ట నుంచి లీకేజీలు ఏర్పడ్డాయి. నిపుణుల కమిటీ పలు పర్యాయాలు పరిశీలించింది. 2020 ఫిబ్రవరిలో మరోమారు పరిశీలించి.. లీకేజీ ప్రాంతంలో గరిష్ట నీటి మట్టం 216.5 మీటర్ల నుంచి దిగువ బాటమ్‌ లెవల్‌ (కటాఫ్‌ వాల్‌) వరకు 100 మీటర్ల పొడవు, 54 మీటర్ల ఎత్తులో ‘ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ డయాఫ్రం వాల్‌’, ఆనకట్ట బయట వైపున శాండ్‌ ఫిల్టర్‌ నిర్మించాలని సూచించారు. టీజీపీ ఇంజనీర్లు రూ.46.68 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. ఈ నెల 9న నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నెలల్లో లీకేజీలకు మరమ్మతులు చేసేలా ఇంజనీర్లు టెండర్లు పిలిచారు. షెడ్యూల్‌ దాఖలుకు ఈ నెల 22న ఆఖరి గడువు. అదే రోజు టెక్నికల్‌ బిడ్‌ ఓపన చేస్తారు. అర్హత సాధించిన కాంట్రాక్టర్ల ప్రైజ్‌ బిడ్‌ 23న ఓపన చేస్తారు. అదే రోజు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి కమిషన ఆఫ్‌ టెండర్స్‌ (సీఓటీ)కి పంపుతారు. అక్కడి నుంచి ఆమోదం రాగానే అర్హత సాధించిన కాంట్రాక్ట్‌ సంస్థతో ఒప్పందం చేసుకొని మరమ్మతు పనులు చేపడతారు. అన్నీ సవ్యంగా జరిగితే సెప్టంబరు ఆఖరు నాటికి పనులు పూర్తి చేసి ఈ ఏడాది గరిష్ట సామర్థ్యం 17 టీఎంసీలు నింపుతామని ఇంజనీర్లు అంటున్నారు.


కాలువలను విస్మరించారు

జలాశయాలు నింపినా కాలువలు లేకపోతే అవి పంటపొలాలకు పారేదెలా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గండికోట జలాశయంలో గత ఏడాది 27 టీఎంసీలు నింపారు. కాలువలు లేకపోవడంతో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. బ్రహ్మం సాగర్‌ లీకేజీ మరమ్మతులు పూర్తి చేసి 17 టీఎంసీలు నింపినా కాలువలు లేకుండా పంట చేలు తడిపేదెలా..? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. కాలువల నిర్మాణం, సీసీ లైనింగ్‌ కోసం రూ.602 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారు. బద్వేలు, పోరుమామిళ్ల డివిజన్లలో అసంపూర్తి డ్రాపులు, అక్విడెట్స్‌, వంతెనలు, మైనర్‌, మేజర్‌ డిసి్ట్రబ్యూటర్లు ఇలా దాదాపుగా 135 స్ట్రక్చర్స్‌ నిర్మాణాలకు రూ.46 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. బ్యాలెన్స పనులు పూర్తి చేస్తే తప్ప లక్ష్యం నెరవేరదు. జలాశయం మరమ్మతులు చేసినప్పటికీ, కాలువలను విస్మరించడంతో సాగునీటి ప్రయోజనాలు రైతులకు ఇప్పట్లో దక్కవని ఇంజనీర్లే అంటున్నారు. కాలువల మరమ్మతులకు ప్రభుత్వం రూ.46 కోట్లు నిధులిస్తేనే 1.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వడం సాధ్యం అవుతుంది.


23న రివర్స్‌ టెండరింగ్‌

- శ్రావణ్‌కుమార్‌రెడ్డి, సీఈ, ఇరిగేషన ప్రాజెక్ట్స్‌, కడప

బ్రహ్మంసాగర్‌ లీకేజీ మరమ్మతులకు ప్రభుత్వం రూ.46.68 కోట్లు నిధులు ఇచ్చింది. టెండర్లు పిలిచాం. టెండర్‌ షెడ్యూల్‌ దాఖలుకు ఈ నెల 22 వరకు గడువు ఉంది. 23న ప్రైజ్‌బిడ్‌ ఓపన చేస్తాం. అదే రోజు రివర్స్‌ టెండరింగ్‌ పూర్తిచేసి సీఓటీకి పంపుతాం. మూడు నెలల్లో మరమ్మతులు పూర్తి చేస్తాం. అసంపూర్తి కాలువల పనుల కోసం రూ.46 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే టెండర్లు పూర్తి చేసి పనులు చేపడతాం.


బ్రహ్మంసాగర్‌ జలాశయం స్వరూపం

-----------------------------------------------

ప్రధాన ఆనకట్ట పొడవు 2.50 కి.మీలు

గార్జ్‌-2 ఆనకట్ట పొడవు 330 మీటర్లు

లోయర్‌ గార్జ్‌ కట్ట పొడవు 554 మీటర్లు

ఎత్తు 50 మీటర్లు

గరిష్ట నీటి మట్టం 216.5 మీటర్లు

నీటి సామర్థ్యం 17 టీఎంసీలు


Updated Date - 2021-06-19T05:38:23+05:30 IST