రూ.4.98 కోట్ల పనులకు శ్రీకారమెన్నడో?

ABN , First Publish Date - 2021-01-11T04:44:48+05:30 IST

జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని నిర్మించాలని మూడు నెలల క్రితం బడ్జెట్‌ కేటాయింపులు జరిగాయి.

రూ.4.98 కోట్ల పనులకు శ్రీకారమెన్నడో?
సంగారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయం

బడ్జెట్‌ కేటాయింపులు పూర్తయినా.. టెండర్లలో తాత్సారం

మున్సిపల్‌ మిగులు నిధులపై మీనమేషాలు

అంచనాలు రూపొందించడంలో జాప్యం


సంగారెడ్డి టౌన్‌, జనవరి 10 : జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని నిర్మించాలని మూడు నెలల క్రితం బడ్జెట్‌ కేటాయింపులు జరిగాయి.  2015 నుంచి 2019 వరకు 14వ ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన పనులను అప్పట్లో టెండర్ల ద్వారా దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు చేయకుండానే చేతులెత్తేశారు. దీంతో మున్సిపల్‌ డిప్యూటీ ఇంజనీర్‌ ఇంతియాజ్‌ ఆహ్మద్‌ ప్రత్యేక చొరవతో వాటిని రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలిచి, పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఐదు సంవత్సరాలుగా మిగిలిపోయిన 14వ ఆర్థిక సంఘం నిధులతో పట్టణంలోని వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి బడ్జెట్‌ను కేటాయిస్తూ అక్టోబరు 31న జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదం తెలియజేశారు. 14వ ఆర్థిక సంఘం కింద రూ.4.30 కోట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌ కింద వసూలైన రూ.68 లక్షలతో కలిపి మొత్తం రూ.4.98 కోట్లతో 76 పనులు చేయాలని కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానించారు. అయితే బడ్జెట్‌ కేటాయింపులు జరిపి మూడు నెలలవుతున్నా అంచనాలు (ప్రతిపాదనలు), టెండ ర్లు ప్రక్రియ చేపట్టడంలో అధికారులు తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈఈ నుంచి అప్రువల్‌ (ఆమోదం) పొందిన తరువాత టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలున్నాయి.


సిబ్బంది కొరతతో ముందుకు సాగని పనులు

సంగారెడ్డి గ్రేడ్‌వన్‌ మున్సిపల్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నందువల్లే పనులు ముందుకు సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీలో మొత్తం 121 మంది సిబ్బంది ఉండాల్సింది. కేవలం 60 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షిషా ఇన్‌చార్జి కమిషనర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్‌ విభాగంలో ఖాళీలు ఉండడం వల్ల ప్రతిపాదనలు సిద్ధం చేయడం, పనులను పర్యవేక్షించడం, ఎంబీ రికార్డులు రాయడం లాంటి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఈ విభాగంలో ముగ్గురు ఏఈలకు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఏఈ లక్ష్మీనారాయణకు ఇటీవల బదిలీ అయింది. అతడి స్థానంలో ఇక్కడకు మరొకరు వచ్చే వరకు రిలీవ్‌ చేయబోమని ఇన్‌చార్జి కమిషనర్‌, అదనపు కలెక్టర్‌ రాజర్షిషా తిరస్కరించారు. కాగా డిప్యూటీ ఈఈ ఇంతియాజ్‌ ఆహ్మద్‌ కూడా గద్వాల్‌ మున్సిపల్‌లో డిప్యూటేషన్‌ కింద పని చేస్తున్నారు. అతడు సోమ, మంగళ, బుధ వారాల్లో గద్వాలలో, గురు, శుక్ర, శనివారాల్లో సంగారెడ్డి మున్సిపల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే సంగారెడ్డి మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి, రెగ్యులర్‌ కమిషనర్‌ను కేటాయించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి రవి, వైస్‌ చైర్‌పర్సన్‌ లతా విజయేందర్‌రెడ్డితో పాటు కౌన్సిలర్లు పలుమార్లు కలెక్టర్‌కు, మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం దక్కడం లేదనే ఆరోపణలున్నాయి.

Updated Date - 2021-01-11T04:44:48+05:30 IST