రూ. 21 కోట్లతో అంబేద్కర్‌ స్టేడియంలో అభివృద్ధి పనులు

ABN , First Publish Date - 2022-01-17T05:51:05+05:30 IST

కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో 21 కోట్లకు పైగా నిదులతో క్రీడాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

రూ. 21 కోట్లతో అంబేద్కర్‌ స్టేడియంలో అభివృద్ధి పనులు
షటిల్‌ ఆడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు

- మంత్రి గంగులకమలాకర్‌

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, జనవరి 16: కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో 21 కోట్లకు పైగా నిదులతో క్రీడాభివృద్ధి  పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల  శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో 1.9 లక్షల స్మార్ట్‌ సిటి నిధులతో ఆధునీకరించిన ఇండోర్‌ స్టేడియం, స్కేటింగ్‌ రింగ్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం  ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, నగర మేయర్‌ సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. 1.55 కోట్లతో ఇండోర్‌ స్టేడియం అభివృద్ధి, 35 లక్షలతో స్కేటింగ్‌ రింగ్‌, 35 లక్షలతో బాస్కెట్‌ బాల్‌ కోర్టుల నిర్మాణం, ఎనిమిది కోట్లతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం,  క్రీడా స్థలాల పనులు సాగుతున్నాయన్నారు. ఎల్‌ఎండీ సమీపంలోని క్రీడా పాఠశాలలో ఎనిమిది కోట్లతో సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌ నిర్మాణం పూర్తి కావస్తుందన్నారు. క్రీడా సౌకర్యాల మెరుగుతో రాబోయే రోజుల్లో జిల్లా క్రీడాకారులు మెరుగైన ఫలితాలు సాధిస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధి కోసం పల్లె ప్రగతి నుంచి నిధులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌లు ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. కరీంనగర్‌ మరికొన్ని నెలల్లో పర్యాక కేంద్రంగా  మారబోతుందన్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రులు,  బీజేపీ పాలిత  రాష్ట్రాల సీఎంలు వారి ప్రాంతాల్లో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో పది శాతం మేర చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.  బీజేపీ  పాలిత  ప్రాంతాల్లో 24  గంటల ఉచిత విద్యుత్‌, రైతు బంధు, రైతు బీమా అందించడం లేదన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్‌,  సుడా ఛైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, డీవైఎస్‌వో కె రాజవీరు, డిప్యూటి మేయర్‌ చల్లా స్వరూపారాణిహరిశంకర్‌, మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, అథ్లెటిక్స్‌ సంఘం జిల్లా  అధ్యక్ష, కార్యదర్శులు నందెళ్లి మహిపాల్‌, కడారి రవి పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-17T05:51:05+05:30 IST