కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌!?

ABN , First Publish Date - 2021-07-20T05:32:06+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో..

కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌!?

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌?

గురుకుల కార్యదర్శి పదవికి రాజీనామా

కేసీఆర్‌ స్కెచ్‌లో భాగమంటున్న రాజకీయవర్గాలు

మలుపులు తిరుగుతున్న హుజూరాబాద్‌ రాజకీయం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు అభ్యర్థే లేడని, ఈటలను ఢీకొనే సత్తా కలిగిన అభ్యర్థి ఎవరని వెదుకుతూ అధికార పార్టీ ఇతర పార్టీలవైపు చూస్తున్నదని ప్రచారం జరుగుతున్న తరుణంలో కొత్తపేరు తెరపైకి వచ్చింది. గతంలో కరీంనగర్‌ ఎస్పీగా పనిచేసిన, ప్రస్తుతం రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా ఉన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో తొలి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి పట్టు ఉండడంతో ఆ వర్గానికే చెందిన అభ్యర్థినే పోటీలో ఉంచాలని టీఆర్‌ఎస్‌ భావించింది. బీజేపీ నుంచి బీసీ వర్గానికి చెందిన ఈటల పోటీలో ఉంటున్నందున బీసీనిగాని, రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కాని బరిలోకి దింపాలని టీఆర్‌ఎస్‌ యోచించింది. ఇంతకాలం ఈ వర్గాలకు చెందిన అభ్యర్థులపైనే ఫోకస్‌ పెట్టింది.


టీఆర్‌ఎస్‌లో ఈటలకు దీటైన పోటీ ఇచ్చే రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ఎవరూ లేకపోవడంతో గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన కౌశిక్‌ రెడ్డిపై ఆ పార్టీ దృష్టి సారించింది. ఈ నెల 21న ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ప్రచారం జరుగుతున్నది. మరోవైపు బీసీ సామాజికవర్గం నుంచి మాజీ శాసనసభ్యుడు, జిల్లాలో బీసీ విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించి ఇప్పటి వరకు బీసీవర్గ ప్రయోజనాల కోసం పాటుపడుతున్న వకులాభరణం కృష్ణమోహన్‌రావు, టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పొనగంటి మల్లయ్య పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. వీరిలో గతంలో రెడ్డి అభ్యర్థులతో పోల్చిచూస్తే 15 వేల ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయిన నేపథ్యం ఉన్న కృష్ణమోహన్‌రావు సరైన అభ్యర్థి అనే అభిప్రాయం వ్యక్తమయింది.


దళిత సామాజిక వర్గంపై దృష్టి

అధిష్ఠానం రెడ్డి, బీసీ వర్గాలపైన ఒకవైపు ఆలోచిస్తూనే మరో కోణంపై కూడా దృష్టి సారించినట్లు భావిస్తున్నారు. నియోజకవర్గంలో 46 వేల పైచిలుకు ఓట్లు ఉన్న దళిత సామాజికవర్గంపై ఆ పార్టీ దృష్టి సారించింది. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఇచ్చిన హామీ, మూడెకరాల భూమి ఇస్తానన్న హామీని సీఎం కేసీఆర్‌ విస్మరించారని ఇతర పార్టీలు చేస్తున్న విమర్శల ఆటకట్టించేందుకు దళిత సాధికారత అంశాన్ని తెరపైకి తెచ్చారు. దళిత సాధికారత పథకానికి తెలంగాణ దళిత బంధు అనే పేరు పెట్టడంతోపాటు హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ నియోజకవర్గంలో ఉన్న 20,989 దళిత కుటుంబాలకు పరిపూర్ణ స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయాలని, ఇందుకోసం 1500 నుంచి 2 వేల కోట్ల రూపాయలు వెచ్చించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. హైదరాబాద్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడి క్షేత్రస్థాయి అమలు అనుభవాలతో రాష్ట్రవ్యాప్తంగా దళితబంధును అమలు చేయాలని కేసీఆర్‌ అధికారులకు సూచించారు. నియోజకవర్గంలోని 46 వేల పైచిలుకు దళిత ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకే కేసీఆర్‌ ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఇక్కడి నుంచి అమలు చేయాలని నిర్ణయించారని రాజకీయవర్గాలు విమర్శిస్తున్నాయి. కేసీఆర్‌ అంతకు మించిన స్కెచ్చే వేశారే భావన వ్యక్తమవుతున్నది. 


సర్వీస్‌ ఉన్నా స్వచ్ఛంద పదవీ విరమణ

సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఇంకా సర్వీస్‌ ఉండగానే తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని, అందుకే కేసీఆర్‌ మాస్టర్‌ స్కెచ్‌లో భాగంగా ఆయన ముందస్తు రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. గురుకులాల కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ కుమార్‌, స్వేరో అనే సంస్థను స్థాపించి దళితవర్గాలను ఒక్కటి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించి సత్ఫలితాలు సాధించారు. ఆ సంస్థ నాయకుడిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు స్వేరో సభ్యుల్లో ఉన్నతస్థానం ఉన్నది.


జిల్లాతో అనుబంధం

జిల్లా ఎస్పీగా పనిచేసిన కాలంలో ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయులను తాము పనిచేస్తున్న గ్రామాల్లోనే ఉండాలని కోరుతూ మావూరికి రండి... మాతోనే ఉండండి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎక్కడికక్కడ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామీణ ప్రాంతాల్లోని అన్నివర్గాల ప్రజలు ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఉపాధ్యాయుల్లో మార్పు వచ్చి ఆ సమయంలో గ్రామాల్లోనే ఉండి పనిచేశారు. గురుకులాల కార్యదర్శిగా కూడా దళిత విద్యార్థులను చదువులోనే కాకుండా వివిధ రంగాల్లో ఉన్నతస్థానాల్లో నిలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆయన గురుకులాల కార్యదర్శిగా కొనసాగడం ఆయన సాధించిన ఫలితాలే కారణం. దళితవర్గాల్లో ఆయనకున్న మంచి పేరు కారణంగా ప్రభుత్వం ఆ పదవిలో కొనసాగించించింది. ఇప్పుడు ఊహించని విధంగా ప్రవీణ్‌ కుమార్‌ తన ఐపీఎస్‌ ఉద్యోగానికి స్వచ్ఛందంగా ముందస్తూ రాజీనామా చేయడంతో ఆయన రాజకీయాల్లో వచ్చే అంశం తెరపైకి వచ్చింది. కేసీఆర్‌ సూచనతోనే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారని, హుజూరాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. హుజూరాబాద్‌ శాసనసభ్యుడిగా గెలిస్తే ప్రభుత్వంలో ఆయనకు ఉన్నత పదవులు లభిస్తాయని, మంత్రిగా వెంటనే అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.


ప్రవీణ్‌ కుమార్‌ టీఆర్‌ఎస్‌లో చేరి హుజూరాబాద్‌ అభ్యర్థిగా పోటీ చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉన్నది. ఆయన రాజీనామా సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పదవీ విరమణ తర్వాత తన శేష జీవితాన్ని తనకు స్ఫూర్తిప్రదాతలైన మహాత్మా జ్యోతిరావుపూలే దంపతులు, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, కాన్షీరాం చూపిన మార్గంలో నడిచి పేదలకు, పీడితులకు అండగా ఉంటూ భావితరాలను కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. తన ఈ కొత్త ప్రయాణంలో అందరి దీవెనలు ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. దీంతో ఆయన ప్రజా జీవితంలోకి వస్తారని భావిస్తున్నారు. స్వేరోయిజాన్ని ప్రారంభించి ఒక ఉద్యమంగా వ్యాప్తి చెందేలా చూసిన ప్రవీణ్‌కుమార్‌ ఇతర రాజకీయ పార్టీల్లో చేరకుండా తానే ఒక రాజకీయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తారని, కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తారని కొందరు అంటున్నారు. 

Updated Date - 2021-07-20T05:32:06+05:30 IST