బీఎస్పీ గూటికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌!

ABN , First Publish Date - 2021-07-28T08:09:56+05:30 IST

తాజా మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తన భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన ఊహాగానాలకు తెరదించుతారని ఆయన సన్నిహితులు అంటున్నారు. బీఎస్పీ వేదికగా తెలంగాణలో ఆయన తన

బీఎస్పీ గూటికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌!

8న చేరిక.. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు?


హైదరాబాద్‌/సూర్యాపేటటౌన్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): తాజా మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తన భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన ఊహాగానాలకు తెరదించుతారని ఆయన సన్నిహితులు అంటున్నారు. బీఎస్పీ వేదికగా తెలంగాణలో ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఆగస్టు 8న బహుజన సమాజ్‌ పార్టీలో చేరతారని మంగళవారం తనను కలిసేందుకు వచ్చిన స్వేరోస్‌ సభ్యులకు ప్రవీణ్‌ చెప్పినట్లు తెలుస్తోంది. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలను ఆయన స్వీకరించే అవకాశం ఉందని సమాచారం. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో సరైన అభ్యర్థి దొరికితే రంగంలోకి దించి ప్రచారం చేయవచ్చని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. కాగా.. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని రాజకీయ జీవితాన్ని ఆరంభించనున్న ప్రవీణ్‌ కుమార్‌కు బహుజన నేతలు, ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి ఆగస్టు 6 వరకు వరుసగా కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఖమ్మం, హైదరాబాద్‌లో అభినందన సభలు జరగనున్నాయి. 


బ్రదర్‌ కౌశిక్‌..! పీడిత కుల నేతలను ఏకవచనంతో పిలుస్తారా?

సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఇటీవల టీఆర్‌ఎ్‌సలో చేరిన మాజీ కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ చురకలు అంటించారు. తెలంగాణ భవన్‌లో కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎ్‌సలో చేరిన సందర్భంగా వేదికపైకి నియోజకవర్గ నేతలను పిలిచారు. అయితే కొందరు నేతలను ఆయన ఏకవచనంతో పిలవడాన్ని ప్రవీణ్‌ తప్పుబట్టారు. ‘‘కౌశిక్‌ బ్రదర్‌..! మీరు ఆధిపత్య కులాల నాయకులను గారు అంటూ గౌరవించి.. పీడిత వర్గాలకు చెందిన వారిని మాత్రం ఏకవచనంతో పిలిచారు. ఇది అభ్యంతరకరం. ఇలాంటి దురహంకార భావజాలం వల్లే జనాలు బహుజన రాజ్యం రావాలంటున్నరు’’ అంటూ మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. ప్రవీణ్‌ ట్వీట్‌కు కౌశిక్‌రెడ్డి ట్విటర్‌లో వెంటనే సమాధానం ఇచ్చారు. ‘‘గౌరవ ప్రవీణ్‌ కుమార్‌ గారూ.. మీరంటే నాకు చాలా గౌరవం. మీ హోదాకు తగిన విమర్శలు చేస్తే బాగుంటుంది. నేను పుట్టిన దగ్గరి నుంచీ నా మిత్రులు బహుజన, దళిత బిడ్డలే. ఎవరో ఎడిట్‌ చేసిన వీడియోను పోస్ట్‌ చేసి మీ స్థాయిని తగ్గించుకున్నారు’’ అని ఆయన అన్నారు.


నల్లగొండ జిల్లా నుంచే రాజకీయ నిర్ణయం ప్రకటిస్తా

సూర్యాపేట ఆత్మీయ సమ్మేళనంలో ప్రవీణ్‌కుమార్‌ 

నల్లగొండ జిల్లా వేదికగా తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని తాజా మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో బహుజన బిడ్డలు పడుతున్న గోసలు, అన్యాయాలను భరించలేకే ఐపీఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటికొచ్చానని చెప్పారు. ఏడు సంవత్సరాల పాలనలో సీఎం కేసీఆర్‌ మొదటిసారి అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేయడం సంతోషకరమన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించడానికే బయటికి వచ్చానని వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-07-28T08:09:56+05:30 IST